కరోనా కట్టడిలో ప్రతిమ సేవలు అభినందనీయమని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. సంచార వైద్యశాల ప్రారంభించడం, కోటి మాస్కులు పంపిణీ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. కరోనా వాక్సిన్ వచ్చే వరకు లాక్డౌన్ చేసి ఇంట్లో ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు.
కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కరోనాతో ఎంతమంది చనిపోతారో తెలియదు కానీ... ఆర్థిక ఇబ్బందులతో ఎన్ని ఉద్యోగాలు పోతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో సహజీవనం చేస్తూనే... ఉపాధి, అభివృద్ధి సాధించాలన్నారు.
పరీక్షలు చెయ్యట్లేదని, సమాచారం దాస్తున్నారని విమర్శలు చేస్తున్నారు... అదే నిజమైతే మరణాలను దాయగలమా అని మంత్రి ప్రశ్నించారు. అక్కడక్కడ లోపాలు లేవనడం లేదు... కానీ వాటిని ఎలా సరిదిద్దాలో సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో రాజకీయాలు చేయడం ఎంతమాత్రం తగదని ప్రతిపక్షాలకు హితవు పలికారు.
రాబోయే కాలంలో ఆరోగ్య రంగంలో మనదేశానికి మంచి అవకాశాలు రాబోతున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫార్మారంగంపై మన రాష్ట్రం నుంచి పని చేస్తున్న నాలుగు కంపెనీలు దూసుకుపోతున్నాయని అన్నారు. 78శాతం వైద్య పరికరాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, కానీ అందులో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండి: 'రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. భావి తరాల కోసం'