కేంద్రం మెడలు వంచైనా ధాన్యం కొనుగోలు చేయిస్తామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అప్పటివరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు.
కరీంనగర్‌లో జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో గంగుల సమావేశమయ్యారు. ఈనెల 12న చేపట్టబోయే ధర్నాపై సన్నాహక సమావేశం నిర్వహించారు. తాము రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. రాష్ట్ర భాజపా నేతలు కూడా కలిసి రావాలని కోరారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగానే శాంతియుతంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు. తాము గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఒక్కరోజు ఆందోళనకే కేంద్రం స్పందించిందని.. ఇప్పుడు కూడా అలాగే స్పందించాలని లేకుంటే ముఖ్యమంత్రి సూచనలతో ఆందోళన ఉద్ధృతం చేస్తామని గంగుల తెలిపారు.
'మేం రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం. తెరాసకు పోరాటాలు కొత్తకాదు. పోరాడే రాష్ట్రం సాధించుకున్నాం.. రైతులకు న్యాయం చేయలేమా?. కేంద్రం మెడలు వంచుతాం. ధాన్యం కొనుగోలు చేసేదాక ఆందోళన చేపడతాం.'
- గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి.
ఇదీచూడండి: Motkupalli Narasimhulu: కేసీఆర్ను టచ్ చేస్తే మాడి మసైపోతారు.. జాగ్రత్త...