రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వరి ధాన్యం కొనుగోలు చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వానకాలం వరి ధాన్యం కొనుగోలుపై ప్రజా ప్రతినిధులు, రైస్ మిల్లర్లు, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. తేమ 17శాతం మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 352 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2లక్షల 52 వేల 760 ఎకరాల్లో వరి సాగు చేశారని, 4 లక్షల 80 వేల క్వింటాళ్ల ధాన్యం రానుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. కాళేశ్వరం జలాలతో తెలంగాణలోని బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయని మంత్రి గంగుల పేర్కొన్నారు. రైతులు తాము పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు కొనుగోళ్లు సజావుగా సాగే విధంగా ప్రభుత్వమే చూసుకుంటుందని, దీనికి స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.