కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుపై చేపట్టిన జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కర్ఫ్యూ ప్రశాంతంగా జరుగుతోంది. కరీంనగర్‌తోపాటు పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, జగిత్యాల, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడల్లోని రహదారులు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌లు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.
జగిత్యాలలో..
జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్భందంలో ఉన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజక వర్గంలో కర్ఫ్యూ ప్రశాంతంగా సాగుతోంది. బొగ్గు గని కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు ముందుగానే కొనుగోలు చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వైరస్‌పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార వాహనాలను వీధుల్లో తిప్పుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
సిరిసిల్లలోను జన సంచారం లేదు
జనతా కర్ఫ్యూ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ప్రభుత్వాలు చేస్తున్న ముందస్తు హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తమయ్యారు. శుక్రవారం నుంచి రాజన్న ఆలయం మూసివేయడం వల్ల భక్తుల సందడి కనిపించడం లేదు. నిత్యం రద్దీగా ఉండే వేములవాడ పట్టణంలో ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.
ప్రజలందరికీ ధన్యవాదాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలపై స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్న ప్రజలకు కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి: 'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'