ఐదు నెలల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. మూడు ప్రధాన పార్టీలు.. 30 అభ్యర్థులకు గతకొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కలిగించిన ఈ నియోజకవర్గంలో చక్రం తిప్పేదెవరో ఇవాళ సాయంత్రం వరకు తెలియనుంది. హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత 753 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలుపెట్టారు. తర్వాత ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారు.
తొలుత హుజురాబాద్ మండలంలోని గ్రామాల ఓట్లు లెక్కించనున్నారు. తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదట పోతిరెడ్డిపేట, ఆఖరున శంబునిపల్లి ఓట్లు కౌంట్ చేస్తారు.
కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కరోనా నిబంధనలతో 2 కేంద్రాల్లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఏడు టేబుళ్ల చొప్పున 2 కేంద్రాల్లో 14 టేబుళ్లపై కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 22 రౌండ్లలో జరగనున్న ఈ ప్రక్రియలో ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశముంది.
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఉదయం 9.30 గంటలకు తొలిరౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. తెరాస నుంచి గెల్లు శ్రీనివాస్, భాజపా నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. సాయంత్రం 4 గంటల వరకు హుజూరాబాద్ బాద్షా ఎవరో తేలనుంది.