Eggs in Midday Meals : రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం(మ.భో.ప) కింద వారానికి మూడు రోజులు విద్యార్థులకు గుడ్లు అందించాలి. గత వారం రోజులుగా కరీంనగర్ జిల్లాలో పాఠశాలల్లో పూర్తిగా అవి బంద్ అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 20-30 శాతం పాఠశాలల్లో గుడ్లను ఇవ్వడం లేదని మ.భో.ప. వంటకార్మికుల నేత నరేశ్ తెలిపారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతోంది. గుడ్డుకు సర్కార్ ఇచ్చే రేటు గిట్టుబాటు కావడం లేదంటూ వంట కార్మికులు చేతులెత్తేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది.
మొన్న భోజనం.. నేడు గుడ్డు
No Eggs in Midday Meals : కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల తదితర జిల్లాల్లోని వంట కార్మికులు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం, వంటధరలు గిట్టుబాటు కావడం లేదని డిసెంబరు నుంచి 40 రోజులపాటు సమ్మెకు దిగారు. ఫలితంగా ఆ జిల్లాల్లోని పాఠశాలల్లో పిల్లలకు భోజనం కరవైంది. ఆ సమయంలో భోజన భత్యమూ పిల్లలకు అందలేదు. ఇప్పుడు భోజనం ఉన్నా గుడ్డు ఆగిపోయింది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 40వేల మంది.. నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి తదితరాలనూ కలిపితే మొత్తం 2లక్షల మంది పిల్లలకు గుడ్డు దూరమైనట్లు తెలుస్తోంది. అయినా.. సమస్య పరిష్కారానికి సర్కారు చొరవ చూపడం లేదు.
No Eggs in Midday Meals at Karimnagar : ప్రభుత్వమిచ్చే ధర చాలడం లేదని పాఠశాల విద్యాశాఖ ఒక్కో గుడ్డుకు రూ.4లు చెల్లిస్తుంది. వంట కార్మికులే సొంతగా కొని, ఉడకబెట్టి విద్యార్థులకు ఇస్తారు. ప్రస్తుతం గుడ్డు ధర రూ.5- 5.50ల వరకు ఉంది. ఇటీవల రూ.6లు పలికింది. దీంతో ఒక్కో గుడ్డుకు రూ.1 నుంచి రూ.2లు నష్టపోవాల్సి వస్తోందని వంట కార్మికులు వాపోతున్నారు. 200 మంది పిల్లలున్న బడిలో రోజుకు రూ.200ల నుంచి రూ.400 వరకు నష్టం భరించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గుడ్డు అందించడం తమ వల్ల కాదని పలు జిల్లాల్లో వంట కార్మికుల సంఘం డీఈవోలకు నోటీసులు ఇచ్చింది. కొన్నిచోట్ల వారానికి ఒక్కసారే ఇస్తామని చెప్పి అధికారులు, ప్రధానోపాధ్యాయుల అంగీకారంతో దాన్ని అమలుచేస్తున్నట్లు తెలిసింది.
అంగన్‌వాడీల మాదిరి అందజేసినా సమ్మతమే..
'వంట కార్మికులంతా పేదలే. కిరాణా దుకాణాల వారిని బతిమలాడుకొని గుడ్లు అప్పు తెచ్చి పిల్లలకు పెడుతుంటాం. అయినా మేం తెచ్చేవాటికి అధికారులు మార్కెట్ ధర కూడా ఇవ్వడం లేదు. ఫలితంగా మాకిచ్చే రూ.వెయ్యి వేతనమూ చేతికి దక్కడం లేదు. అందుకే గుడ్లు సరఫరా చేయలేమంటూ నోటీసులిచ్చాం. అంగన్‌వాడీలతరహాలో బడులకు సైతం ప్రభుత్వమే గుడ్లు సరఫరా చేసినా అభ్యంతరం లేదు. గత సెప్టెంబరు నుంచి బిల్లులు కూడా ఇప్పటివరకు మాకు అందలేదు.'
- మంజుల, స్వరూప వంట కార్మికుల సంఘం, కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు, కార్యదర్శి