కరోనాపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాపారులకు సూచించారు. కరీంనగర్‌లోని టవర్ సర్కిల్ డేంజర్ జోన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగడం చాలా బాధగా ఉందన్నారు. టవర్ సర్కిల్‌లో నగరపాలక కమీషనర్ క్రాంతితో కలిసి సంజయ్ పర్యటించారు. వర్షం కురుస్తున్నా.. గొడుగు పట్టుకుని వీధుల్లో తిరుగుతూ.. వ్యాపారులకు జాగ్రత్తలు చెప్పారు.
కరోనా వైరస్ సోకినా తగ్గిపోతుందని, అనవసరంగా ఆందోళన చెందవల్సిన అవసరం లేదన్న ఎంపీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్త వహించవద్దన్నారు. వైరస్ సోకిన వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.
దీనికి తోడు అద్దె ఇళ్లలో ఉన్న వారికి వైరస్ సోకితే ఇంటి యజమానులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలా కాకుండా మానవత్వంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌లో శాతవాహన వర్సిటీలో ప్రభుత్వ క్వారంటైన్ కొనసాగుతోందని.. ఇళ్లలో ఉండటం ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే వర్సిటీలో ఉండవచ్చని సూచించారు.