జగన్ కేబినెట్‌లో బెర్తు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు స్వయంగా రంగంలోకి దిగిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. వారిని సచివాలయానికి పిలిపించుకొని బుజ్జగిస్తున్నారు. మొన్నటి వరకు హోంమంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత.. తనను కేబినెట్‌లో కొనసాగించకపోవడంపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా మంత్రి పదవి రాలేదంటూ అలకబూనారు.
వీళ్లద్దరినీ ఇవాళ క్యాంపు కార్యాలయానికి పిలిపించిన ముఖ్యమంత్రి.. అందరినీ సర్దుబాటు చేయటం వల్ల మంత్రి పదవులు ఇవ్వటం కుదరలేదని చెప్పినట్లు తెలిసింది. సీఎంతో భేటీ అనంతరం మాట్లాడిన సుచరిత.. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిగా ఉండటం వల్లే బయటకు రాలేదన్నారు. కేబినెట్ నుంచి తొలగించినందుకు ఎలాంటి బాధ లేదన్నారు. ఇన్నాళ్లూ తనను గుర్తించి, గౌరవించిన పార్టీ పట్ల ఎప్పటికీ అభిమానం తగ్గదన్నారు.
"అనారోగ్యం వల్ల నెలరోజులుగా బయటకు రాలేకపోయా. వైకాపాలో జడ్పీటీసీ నుంచి హోంమంత్రి స్థాయికి ఎదిగా. రెండున్నర ఏళ్ల తర్వాత కేబినెట్‌ను మారుస్తామని సీఎం ముందే చెప్పారు. సీఎం జగన్ ఎప్పుడూ కుటుంబంలో మనిషిలా నన్ను ఆదరించారు." - సుచరిత, మాజీ మంత్రి
ఇవీ చదవండి: