సీఎం కేసీఆర్‌కు పేదల మీద ప్రేముంటే.. వాళ్లకు మంచి చేయాలనే ఆలోచనే ఉంటే.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి 80 లక్షల పేద కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ డబ్బులు సరిగా చెల్లించడం లేదని.. ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నాయని షర్మిల ఆరోపించారు. హైదరాబాద్ నుంచి వచ్చే డబ్బులే సరిగా రావడం లేదు.. ఇక దిల్లీ నుంచి వచ్చే వాటికి నమ్మకమేంటనే అనుమానం.. కార్పొరేట్ యాజమాన్యాలలో ఉందన్నారు.
బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రి ప్రారంభంలో కేంద్ర, రాష్ట్రల మధ్య సఖ్యత లేక ఆగిపోవడం, రేపొద్దున కేంద్ర రాష్ట్ర సంబంధాలు చెడితే.. చెల్లింపుల విషయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి ఒక వ్యవస్థ నిర్మాణమైందని తెలిపిన షర్మిల ఆయుష్మాన్ భారత్‌తో పేదలు గందరగోళానికి గురవుతారని అభిప్రాయపడ్డారు. కరోనాను ఆరోగ్యశ్రీలోనే చేర్చి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని సూచించారు.