CM Jagan on nellore leaders disputes: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో వైకాపా నేతల రచ్చపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫ్లెక్సీల వివాదం సహా అనేక అంశాలను సీరియస్‌గా తీసుకున్న సీఎం.. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. ఈ విషయంపై కాకాణి, అనిల్‌కు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. వీరిద్దరూ మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇరు నేతల మధ్య విభేధాలను సీఎం పరిష్కరించనున్నట్లు సమాచారం.
అసలేం జరిగింది: అధికార వైకాపాలో నెలకొన్న ఆధిపత్య పోరు, వర్గ విభేదాలతో నెల్లూరులో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. తాజాగా మంత్రి కాకాణి ఫ్లెక్సీలు తొలగించటంపై ఆనం సోదరులు మండిపడ్డారు. నెల్లూరులో అరాచకం రాజ్యమేలుతోందని, మంత్రి స్వాగత ఫ్లెక్సీలను సైతం చించేశారని ఆనం జయకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సోమవారం రాత్రి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. నగరంలోని ముత్తుకూరు రోడ్డు సర్కిల్లో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎంపీ ఫ్లెక్సీలను చించి వేయటంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా.. నెల్లూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని సైతం.. గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. మాజీమంత్రి అనిల్‌తో ఉన్న విభేదాల వల్ల.. ఆయన అనుచరులే తొలగించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విమర్శలను మంత్రి కాకాణి ఖండించారు. ఫ్లెక్సీల రగడపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవని స్పష్టం చేశారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశాక తొలిసారి నెల్లూరు రావడం.. అదే రోజు అదే నగరంలో మాజీ మంత్రి అనిల్ సభ నిర్వహణ ప్రకటనతో వర్గపోరు అనుమానాలు ఊపందుకున్నాయి. బల ప్రదర్శనకు ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్నలూ వచ్చాయి. పోలీసులూ సిబ్బందిని భారీగా మోహరించారు. ఈ క్రమంలో.. ఇద్దరు నేతలతోనూ పార్టీ పెద్దలు మాట్లాడినట్లు సమాచారం. ఎవరి కార్యక్రమాలు వారు.. వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా నిర్వహించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఫలితంగా వర్గపోరేమీ లేదన్నట్లుగా.. కాకాణి, అనిల్ సభలు ముగించారు.
తామంతా జగన్ వర్గమేనన్న నేతలు: మంత్రిస్థాయిలో తొలిసారి జిల్లాకు వచ్చిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. రోడ్‌షో అనంతరం సభ నిర్వహించారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ సహా గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి హాజరు కాలేదు. ఈ క్రమంలో మంత్రిగా అందరినీ కలుపుకొని పని చేస్తానంటూ కాకాణి స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మాత్రమే కాకుండా నీటి పారుదలశాఖపైనా సమీక్షించాలని మంత్రి కాకాణికి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు.
ఇక మంత్రివర్గం నుంచి తనను తొలగించినందుకు బాధపడలేదని మరో సభలో మాజీమంత్రి అనిల్ స్పష్టం చేశారు. తన వయసు కేవలం నలభై రెండేనన్న అనిల్.. జగన్ మళ్లీ మళ్లీ విజయం సాధిస్తే తనకు పదవి దక్కొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
పెళ్లి చేసుకోమని కానిస్టేబుల్ వేధింపులు.. ఆ యువతి ఏం చేసిందంటే?