డబ్బులు సంపాదించాలనేది ఓ యువకుడి ఆశ. వాళ్లు ఏదో చేస్తున్నారు? తాను అలానే చేస్తే ఎలా అనుకున్నాడు. యూట్యూబ్‌ను అడ్డాగా చేసుకున్నాడు. కొత్తగా ప్రయత్నించాలనుకున్నాడు. కటకటాల పాలయ్యాడు. తిరుపతి సమీపంలోని ఎర్పేడు మండలం చెల్లూరుకు చెందిన రామిరెడ్డి అనే యువకుడు రాత్రికిరాత్రే మిలియనీర్ అయిపోవాలనుకున్నాడు. ఏం చేయాలి? అంత ఈజీగా అయ్యే పని కాదు. చేస్తే డిఫరెంట్‌గా చేసి యూట్యూబ్‌లో పెట్టాలనుకున్నాడు. పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, బైకులు, బొమ్మలు, టపాసులు పెట్టి వాటిపై నుంచి రైలు వెళ్తుండగా వీడియో తీశాడు. అది తన యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు.
మంచి చేస్తే సామాజిక మాధ్యమాల్లో ప్రశంసించే వాళ్లు ఉన్నట్లే.. ఏదైనా ప్రమాదానికి కారణమయ్యే పనులు చేస్తే స్పందించే వ్యక్తులూ ఉంటారు కదా! అదే జరిగింది. ఆ వీడియో చూసిన ఓ వ్యక్తి ... ట్విటర్ ద్వారా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రయత్నాలతో రైలు ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ.. చర్యలు తీసుకోవాలని కోరాడు. స్పందించిన పోలీసులు రామిరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు. యువతకు మీరిచ్చే సందేశమేంటని రామిరెడ్డిని ప్రశ్నించగా... ఇలాంటి సాహసకృత్యాలు శృతి మించితే... తనలాంటి పరిస్థితులు ఎదురవుతాయని హితబోధ చేశాడు.
ఇదీ చదవండి: నియమాలు ఉల్లంఘిస్తున్న యూట్యూబ్ స్టార్స్