బెయిల్ బ్యాచ్ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నట్లు ఉందని ఏపీలోని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. గృహహింస చట్టం కింద నిందితుడిగా ఉన్న ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్ మరో ఇద్దరు నిందితులతో కలిసి తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ బాగోతంపై సరైన సమయంలో సమగ్ర వివరాలతో 420 చట్టం కింద ఫిర్యాదు చేస్తానన్నారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటికొస్తాయని తెలిపారు.
తనపై వారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రఘురామ అన్నారు. సునీల్ కుమార్‌పై ఆయన భార్య గృహహింస కేసు వేసిందని చెప్పారు. అతనిపై గృహహింస కేసులో ఛార్జ్‌షీట్ నమోదైందని రఘురామ అన్నారు.
ఏపీ సీఐడీ డీజీపై గృహ హింస కేసులో తెలంగాణ పోలీసులు ఛార్జీషీట్ వేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయొద్దంటూ సునీల్ కుమార్ కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దానిపైన ఇంకా నిర్ణయం వెలువడలేదు. ఒకరకంగా ఆయన బెయిల్‌పై ఉన్నారు. బెయిల్ మీద ఉన్న ఓ వ్యక్తి.. ఏపీ సీఐడీకి డీజీగా ఉంటూ.. మరో ఇద్దరు నిందితులతో కలిసి నీతులు వల్లిస్తున్నారు.
- రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
ఇదీచూడండి: TRS: తెరాస ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ భేటీ