విశాఖను ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధానిగా చేయడం ఫలితంగా... భీమిలి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వివరించారు. మధురవాడలో ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయం మేలు చేస్తుందని ఉద్ఘాటించారు.
ఆంధ్ర ప్రదేశ్‌కు 3 రాజధానులు ప్రకటించి... జగన్ మంచిపని చేశారని వైకాపా నేతలు కొనియాడారు. ప్రాంతీయ భేదాలు, వెనుకబాటుతనం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. భవిష్యత్తులో అలాంటి అసమానతలు తలెత్తకుండా ఉండేందుకే... 3 రాజధానుల ప్రకటన చేశారన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కర్నూలులో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా చేసే నిర్ణయం చాలా గొప్పదని... మంత్రి ధర్మాన కృష్ణదాస్ అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని వివరించారు. విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలన్న జీఎన్‌రావు కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. సాగర నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా నిర్ణయించడం వల్ల ఖర్చు తగ్గుతుందన్నారు. రహదారి, రైలు, విమాన, జల సౌకర్యాలు విశాఖకు ఉన్నాయన్నారు. పరిపాలనా పరంగా విశాఖను కేంద్రంగా చేయడం వల్ల... ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందాలన్న స్థానికుల కోరిక నెరవేరుతుందని చెప్పారు.
ఇవీచూడండి: 'చంద్రబాబుపై కసితోనే అమరావతికి మంగళం'