Yadava Mahasabha: యాదవుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. హైదరాబాద్ నాగోల్‌లో యాదవ విద్యావంతుల వేదిక, అఖిలభారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జరిగిన యాదవుల ఆత్మగౌరవ మహాసభలో ఆయన పాల్గొన్నారు. యాదవులు ఐక్యంగా ఉండడం వల్లే అభివృద్ధి చెందుతారని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. పాండవుల పక్షాన ధర్మం, న్యాయం ఉండటం వల్లనే శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలబడ్డారని, యాదవులు కూడ శ్రీకృష్ణుని మార్గంలో పయనించి దేశం, సమాజం కోసం ధర్మం పక్షాన నిలబడాలని ఆయన కోరారు. విద్యావంతులు ఓ పేద యాదవ విద్యార్థికి అండగా నిలవాలన్నారు. గోమాతను రక్షించుకివాలని, ధర్మ రక్షణ దిశగా ముందుకు సాగాలని కోరారు. లోక కల్యాణం కోసం యాదవులు సంఘటితంగా ముందుకు సాగాలని తెలిపారు.
యాదవుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్న మంత్రి తలసాని... జన్మాష్టమి, సదర్ వేడుకలతో యాదవులు ఐక్యత పెంచుకోవాలన్నారు. యాదవులకు దేశంలోనే ఘనమైన చరిత్ర ఉందని, యాదవ బిడ్డలను బాగా చదివించుకునేందుకు వసతిగృహం నిర్మాణానికి పూనుకోవడం సంతోషకరమన్నారు. శ్రీకృష్ణుని వారసులుగా వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నారని, ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.
"యాదవులకు దేశంలోనే ఘనమైన చరిత్ర ఉందని, యాదవ బిడ్డలను బాగా చదివించుకునేందుకు వసతిగృహం నిర్మాణానికి పూనుకోవడం సంతోషకరం. యాదవులు శ్రీకృష్ణుని వారసులుగా వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నారు. యాదవ బిడ్డల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తూ... రాజకీయంగా విశేషంగా ప్రోత్సాహిస్తున్నారు." -తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మంత్రి
ఇవీ చదవండి: