Harish Rao on Telangana IT Field : ప్రపంచంలో టాప్ 5 టెక్ కంపెనీలకు నిలయంగా హైదరాబాద్ మారిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణ యువతకు మంచి సాంకేతిక నైపుణ్యాలున్నాయని కొనియాడారు. నీతి ఆయోగ్ ఆవిష్కరణల ర్యాంకింగ్‌లో తెలంగాణ రెండో స్థానంలో నిలవడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆస్పైర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సేవలు ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.. ఫ్లోరిడా, యూఎస్‌ఏ ఆధారిత సాంకేతిక సేవల సంస్థ ఫియోనిక్స్ టెక్నాలజీలో భాగంగా ఇక్కడ ఆస్పైర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలుగు విద్యార్థులకు ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందకు అనుగుణంగా ఈ కంపెనీ ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు.
"ప్రపంచంలోని ఐటీ సంస్థలకు అగ్రగామి గమ్యస్థానంగా హైదరాబాద్ ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద బహుళజాతి సంస్థలు తమ విస్తరణ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేశాయి. తెలంగాణ యువతకు ఎంతో టాలెంట్ ఉంది. నూతన అవకాశాలు అనేకం ఉన్నాయి. ఆవిష్కరణల సూచీలో కర్ణాటక, తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో ఉంటే... గుజరాత్, బిహార్ 14, 15 స్థానాల్లో ఉన్నాయి. డబుల్ ఇంజిన్ గ్రోత్ రాష్ట్రాలు వెనుకబడ్డాయి. ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ఆవిష్కరణల్లో అగ్ర స్థానంలో ఉంటున్నాం అంటే..ఇదంతా ఎలా సాధ్యమవుతుంది?. ఒక లక్ష్యంతో పని చేయడం వల్ల. ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడి పౌరులకు కల్పించడం వల్ల. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్.. విధానానికి తోడు, అద్భుతమైన ప్రభుత్వ విధానాలు శాంతి భద్రతల నిర్వహణ, రాజకీయ సుస్థిరత, ఇక్కడి భౌగోళిక వాతావరణం వల్ల సాధ్యమైంది." హరీశ్ రావు, మంత్రి