దేశవ్యాప్తంగా... ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ తరుణంలోనే అన్ని వర్గాల ప్రజలు, సామాన్యులు ఉపాధి వేటలో పడ్డారు. వివాహాది, శుభకార్యాలు, ఇతర సంబురాలు, సభలు, సమావేశాలు ఊపందుకుంటున్న వేళ... చేతివృత్తుల కుటుంబాలకు డిమాండ్ పెరిగింది. పెళ్లిళ్లు, ఇళ్లు, దేవాలయాలు, కార్యాలయాలు, దుకాణాల్లో ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో అందంగా అలంకరించేందుకు వీలుగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద కొబ్బరి మట్టలతో తయారు చేస్తున్న విభిన్న ఆకృతులకు గిరాకీ ఏర్పడింది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడం, శుభకార్యాలు ఊపందుకోవడంతో మహిళలు రోజంతా తయారీలో నిమగ్నమవుతున్నారు.
రెండు దశాబ్దాల క్రితం నగరానికి..
దాదాపు 70 కుటుంబాలు.. ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల నుంచి రెండు దశాబ్దాల కిందట నగరానికి విచ్చేసి.. తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొవిడ్ సమయంలో రెండు దఫాలు విధించిన లాక్‌డౌన్ ఆంక్షల సమయంలో ఆర్డర్లు లేకపోవడం, ఉపాధి కొరవడి తినడానికి కూడా తిండి దొరక్కుండా తీవ్ర ఇబ్బందులకు గురైన తమకు ఇప్పుడిప్పుడే పనులు దొరుకుతున్నాయని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఆమె పేరు ఆర్.శ్యామల. రాజమండ్రికి చెందిన ఆమె.. కొన్నేళ్ల కిందట ఉపాధి కోసం కుటుంబంతో సహా వచ్చి కొబ్బరి మట్టలు, ఆకులతో రకరకాల ఆకృతులు తయారు చేస్తూ ఉపాధిపొందుతోంది. దీపావళి తర్వాత వివాహాది, శుభకార్యాలు మొదలుకావడంతో తమకు పనులు దొరుకుతున్నాయని శ్యామల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శుభకార్యాలను మరింత అందంగా..
వీరంతా చేతివృత్తుల్లో చక్కటి నైపుణ్యం సొంతం చేసుకున్న కుటుంబాలే. మహిళలే కాకుండా యువతులు కూడా ఎంతో ఓపికతో ప్రకృతి, సహజత్వం ఉట్టిపడేరీతిలో అద్భుతమైన ఆకృతులు తయారు చేస్తున్నారు. కొబ్బరి మట్టలపై ఉండే ఆకులతో బంతులు, చాపలు, తెరలు, చాటలు, చిలుకలు, కేన్ బాస్కెట్, బుట్ట, చలువ పందిళ్లు తయారీలో నిమగ్నమయ్యారు. జంట నగరాల్లో కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లల్లో పెళ్లి పందిళ్ల కోసం వినియోగించే అన్ని రకాలు ఆకృతులు మరింత అందం తెచ్చేలా అల్లేస్తున్నారు. సాధారణంగా పెళ్లిళ్లు, పండుగల సమయంలో మాత్రమే పనులు ఉంటున్న దృష్ట్యా ఈవెంట్ ఆర్గనైజర్ల ద్వారా ఆర్డర్లు తీసుకుని అవి తయారుచేసి ఇస్తుండటం అనవాయితీగా వస్తుంది. నేరుగా యజమానుల నుంచి ఆర్డర్లు సంపాదించుకునే అవకాశాలు లేకపోవడంతో గుత్తేదారులపై ఆధారపడటం వల్ల రోజుకు 400 నుంచి 500 రూపాయల కూలీ వేతనం పొందుతున్నారు. అదే పురుషులకైతే 700 నుంచి 800 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ పనులు చేసుకుంటేనే పూట గడుస్తుంది. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లల్లో ఖాళీగా ఉన్నామని... తాజాగా కాస్త పనులు దొరుకుతున్నప్పటికీ ఇంత కష్టపడుతున్నా కూలీ రేట్లు మాత్రం పెరగడంలేదని మహిళలు వాపోతున్నారు.
ఆకర్షణీయమైన అలంకరణ వస్తువులతో..
ఇదొక వ్యాపార, ఉపాధి వ్యాపకం కావడంతో కాస్త ఆర్థిక స్థోమత గల కుటుంబాలు ఓ అడుగు ముందుకేస్తున్నారు. గుత్తేదారు ఇచ్చే ఆర్డర్లపై పనులు చేసుకుంటూనే సొంతంగా వెదురుతో ఎన్నో ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. శుభకార్యాలయాల్లో ఉపయోగించే... వెదురు బుట్టలు, చాటలు, బహుకరించే గిఫ్ట్ ప్యాకింగ్, ఫ్రూట్ ప్యాకింగ్... ఇళ్లల్లో అందం రెట్టింపు చేసే అలంకరణ వస్తువులు... తయారు చేసి విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు.
పొరుగు రాష్ట్రమైనప్పటికీ... భాగ్యనగరంలో ఉపాధి రీత్యా ఆయా కుటుంబాలన్నీ స్థిరపడ్డాయి. రేషన్ కార్డు, ఓటు హక్కు కూడా హైదరాబాద్‌లో ఉండటంతో లాక్‌డౌన్ సమయంలో ఉచిత బియ్యం పంపిణీ, ఆర్థిక సాయం లభించాయి. కొవిడ్ టీకా వేయడం వల్ల భయలేకుండా తమ పనులు చేసుకుంటూ ధైర్యంగా ఉంటుండటం విశేషం.
ఇదీ చూడండి: