chandra babu: తెదేపా అధినేత చంద్రబాబుకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేదీన ఉదయం 11గంటలకు మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలి అత్యాచారం ఘటనపై విచారణ జరిపేందుకు వెళ్లిన తనను అడ్డుకుని, దూషించారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అభియోగాలు మోపారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం-1998లో సెక్షన్ 14 ప్రకారం కమిషన్కు కోర్టు తరహాలో విచారణ జరిపే అధికారాలున్నట్లు నోటీసులలో పేర్కొన్నారు. అయితే.. అత్యాచార బాధితురాలిని కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో చంద్రబాబునాయుడితోపాటు తెదేపా నాయకులు అడ్డుకుని గొడవ పడ్డారని.. ఉద్రిక్త పరిస్థితులు కల్పించారని.. అక్కడి రోగులను భయాందోళనలకు గురి చేశారని పేర్కొన్నారు. గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారిని ఇలా అవమానపర్చటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. నిర్దేశించిన సమయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
చంద్రబాబుతోపాటు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు సైతం ఇదే తరహా నోటీసులు జారీ చేశారు. ఈనెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసుల్లో పేర్కొన్న తేదీల్లో తప్పులు దొర్లాయి. నోటీసులు ప్రారంభంలో ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. చివర్లో మాత్రం నవంబర్ 27వ తేదీ అని పేర్కొనటంతో గందరగోళం నెలకొంది. దీనిపై మహిళా కమిషన్ వర్గాలను వివరణ కోరగా.. టైపింగ్లో పొరపాటుగా సమాధానం ఇచ్చారు. ఈనెల 27వ తేదీన విచారణ ఉంటుందని స్పష్టం చేశారు.
జగన్ రెడ్డికి ఎప్పుడు నోటీసులిస్తారు..?: మహిళా కమిషన్ తెదేపా అధినేత చంద్రబాబుకు నోటీసు జారీ చేయటంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వాస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతికి న్యాయం చేయాలని అడగటమే నేరమైతే... మహిళల శీలానికి రేటు కట్టి ఉన్మాదులను రెచ్చిపోమంటూ విచ్చలవిడిగా రోడ్ల మీద వదిలేస్తున్న సీఎం జగన్ రెడ్డికి ఎప్పుడు నోటీసులు ఇస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రిని ఎప్పుడు విచారిస్తారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయాలి: చంద్రబాబు