Sabitha Indra Reddy : మహిళలు సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగినప్పుడే అద్భుతాలు సృష్టించగలరని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళలు, యువతుల రక్షణ కోసం మహిళా కమిషన్ అందుబాటులోకి తీసుకొచ్చిన ‘వాట్సాప్ నంబరు 9490 5555 33’ను ఆమె ప్రారంభించారు. ఈ నంబరును ప్రతి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల్లో గోడలపై రాయిస్తామన్నారు. ఆపదలో ఉన్నవారెవరైనా ఈ నంబరుకు సందేశం పింపిస్తే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి రక్షణ కల్పిస్తారని చెప్పారు.
Telangana Women Commission : మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ మాట్లాడుతూ.. రెండేళ్లుగా కొవిడ్ కారణంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించలేకపోయామని, అందుకే ఈ ఏడాది మూడు రోజులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళాశిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ తదితరులు మాట్లాడారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన దీప్తిరావు (వీ హబ్, సీఈఓ), పి.నిర్మల తేజశ్రీ (కళాకారిణి), తల్లపల్లి యాకమ్మ (రచయిత్రి), కొమెరపూడి పావని (విశ్వైక) (కవయిత్రి), డా.పద్మావతి (సామాజిక సేవ), రోహిణీనాయుడు (గిరి ఫౌండేషన్, ఎన్జీవో), ఎస్.దీప (ప్రభావ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ), వి.సుకన్య (ఎన్జీవో)లను సత్కరించారు.