ఏటా వర్సిటీలు, కళాశాలలు వివిధ అంశాలపై జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుపుతాయి. ఈ ఏడాది దాదాపు 90 శాతం వరకు సదస్సులు తగ్గిపోతాయని ఓయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విశ్రాంత ఆచార్యుడు పార్థసారథి అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థలు నిర్వహించే సదస్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు నిధులు మంజూరు చేస్తాయి. ఆయా విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన సదస్సు స్థాయిని బట్టి సదస్సుకు రూ.50 వేల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుంది. ఏడాదికి ఒక్క యూజీసీనే రూ.100 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు చెబుతున్నారు. హెచ్‌సీయూలో ఏటా కనీసం 100 సదస్సులు జరుగుతాయని, వాటిసంఖ్య ఈసారి తగ్గుతుందని ఉపకులపతి పొదిలె అప్పారావు చెప్పారు.
భారీగా ఆన్‌లైన్ సెమినార్లు
ప్రత్యక్ష సదస్సుల స్థానంలో ఈసారి వెబినార్లు భారీగా జరగనున్నాయి. నెల రోజులుగా రాష్ట్రంలో భారీగా జూమ్, గూగుల్ మీట్ లాంటి సాఫ్ట్‌వేర్లు వినియోగించుకుని వెబినార్ ద్వారా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఏ దేశంలోని నిపుణులు ఉన్నా కొద్దిసమయం పాల్గొని తమ అనుభవాలను పంచుకోవాలని కోరవచ్చని ఓయూ మెకానికల్ విభాగాధిపతి ఆచార్య రమేశ్‌బాబు చెప్పారు. వచ్చే రెండేళ్ల వరకు వెబినార్ సదస్సులే అధికంగా ఉంటాయన్నారు.