Fire Services Act in Telangana : అగ్నిమాపక సేవల చట్టం అంటే రాష్ట్రంలో భయం లేకుండా పోయింది. నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించినా ఏం కాదులే... కఠిన శిక్షణలు, భారీ జరిమానాలు ఉండవనే ధీమా తప్పుచేసేవారిలో కనిపిస్తోంది. రాష్ట్రంలో 2015 నుంచి 2021 వరకు 61 వేల 342 ప్రమాదాలు చోటు చేసుకోగా.... 304 మంది మృతి చెందారు. 1380 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.
weak acts regarding fire accidents : ఈ ఘటనలల్లో అగ్నిమాపక శాఖ మోపిన అభియోగాలు కేవలం 689 మాత్రమే. న్యాయస్థానాల్లో అభియోగాలు రుజువై... ఒక కేసులో నెల రోజులు శిక్ష పడింది. 83 కేసుల్లో జరిమానాలు విధించారు. ఎంతటి ప్రమాదమైనా 25 వేల రూపాయలు మాత్రమే జరిమానా ఉండడంతో ఉల్లంఘనులు రెచ్చిపోతున్నారు. ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తేనే నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉంది. అగ్నిమాపక సేవల చట్టం నామమాత్రంగా తయారైందనే విమర్శలు వస్తున్నాయి.
weak acts regarding fire accidents in telangana : అగ్నిమాపక శాఖ.. ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో ఉల్లంఘనలు గుర్తించినా.. వెంటనే చర్యలు చేపట్టే అవకాశం లేదు. తొలుత ఫాం 9కింద నోటీసులు జారీ చేసి... తనిఖీకి వెళ్లాల్సి ఉంటుంది. ఉల్లంఘనలు గుర్తిస్తే ఫాం 12 కింద నోటీసులు ఇచ్చి.. నెల రోజులు వేచి చూడాలి. అనంతరం ఫాం 14 కింద నోటీసులు ఇచ్చి.. మూడు నెలల సమయం ఇస్తారు. అయినా స్పందించపోతే కేసు నమోదు చేస్తారు. ఇంత చేసి ఉల్లంఘనలు రుజువు చేస్తే...వారికి వేసే జరిమానా 10 వేల రూపాయలు మాత్రమే. చట్టంలో సవరణలు చేయాలని అగ్నిమాపక శాఖ రెండేళ్ల క్రితమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం ఆమోదిస్తే.. ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
అగ్నిప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేసే అధికారం యంత్రాంగం.. ఆ తర్వాత బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని విమర్శలు వస్తున్నాయి. కళ్ల ముందే ఉల్లంఘనలు కనిపిస్తున్నా...అగ్నిమాపక, విద్యుత్తు, జీహెచ్‌ఎంసీ అధికారులకు పట్టడం లేదు. హైదరాబాద్‌లో ఈ ఏడాది తొమ్మిది నెలల్లో భారీస్థాయి అగ్నిప్రమాదాలు మూడు జరిగాయి.
బోయిగూడలోని తుక్కుగోదాంలో 12 మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. జనావాసాల మధ్య తుక్కు గోదాం ఉండకూడదనే నిబంధనలు ఉన్నా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోలేదని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. సికింద్రాబాద్‌లోని రూబీ లగ్జరీ ప్రైడ్ దుర్ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ సెల్లార్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రిక్ బైక్ షో రూం నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక, విద్యుత్, జీహెచ్‌ఎంసీ అధికారులు.. తప్పు మాది కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిప్పు రగిలినప్పుడే మాత్రమే అగ్నిమాపక అనుమతులు గుర్తుకొస్తున్నాయి. అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే..ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉంది.