రైతన్నను, వ్యవసాయాన్ని కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాడేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ అంశంపై ఆరో తేదీన జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు.
దేశానికే ధాన్యాగారంగా..
తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందన్న కేసీఆర్.. స్వరాష్ట్రంలో వ్యవసాయ రంగంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడన్నారు. రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు.
ప్రతీ నీటిబొట్టును..
సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీ జలాలను ఒడిసిపట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరి, కృష్ణానదీ జలాల్లో రాష్ట్రానికి హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును వినియోగించుకొని తీరుతామని సీఎం స్పష్టం చేశారు.