భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్ననీటి వనరుల కింద వానాకాలంలో అత్యధిక ఆయకట్టుకు నీరందించాలని నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నిర్ణయించింది. దాదాపు 50 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించవచ్చని అంచనా వేసినట్లు తెలిసింది. చిన్ననీటి వనరులు, చిన్న ఎత్తిపోతల కింద సాగయ్యే ఆయకట్టు దీనికి అదనం. రిజర్వాయర్లలో నీటి నిల్వలు గతంలో కంటే మెరుగ్గా ఉండటం, జూన్‌లోనే ప్రవాహాలు ప్రారంభం కావడం, సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో పాత ప్రాజెక్టులతోపాటు కొత్త ప్రాజెక్టుల కింద ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వాలని భావిస్తున్నారు.
ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు, మురళీధర్, అనిల్‌కుమార్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, హరిరాం, శంకర్, చీఫ్ ఇంజినీర్లు శ్రీకాంతరావు, వీరయ్య, హమీద్‌ఖాన్, రమేష్, శ్రీనివాసరెడ్డి, మధుసూదనరావు, కొందరు ఎస్‌ఈలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 55 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద నీటి విడుదలపై చర్చించారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద బుధవారం వరకు 37 లక్షల ఎకరాలకు ప్రతిపాదనలు రాగా, కాళేశ్వరం సహా మరికొన్నింటి కింద ప్రతిపాదనలు అందాల్సి ఉంది. వీటితో పాటు చిన్ననీటివనరులు, చిన్న ఎత్తిపోతలు కలిసి మొత్తం 50 లక్షల ఎకరాల వరకు సాగులోకి రావచ్చని అంచనా. ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.
ఏ ప్రాజెక్టు కింద ఎంత?
ప్రాజెక్టుల వారీగా ప్రతిపాదిత ఆయకట్టు, అవసరమైన నీరు, ప్రస్తుత నీటి లభ్యత, ఎప్పటి నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి తదితర అంశాలపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. అత్యధికంగా శ్రీరామసాగర్ కింద 9.68 లక్షల ఎకరాలుండగా, ఎస్సారెస్పీ రెండోదశ, వరద కాలువ కింద కలిపి 13 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరందించాలని ప్రతిపాదించారు. దిగువమానేరు డ్యాం కింద 5.3 లక్షల ఎకరాల ఆయకట్టు, దిగువమానేరు ఎగువ భాగాన 4.62 లక్షల ఎకరాలకు నీరందిస్తారు. కొత్తగా నిర్మించిన మధ్యమానేరు కింద 52 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించనుండగా, ఎగువమానేరు కింద 13,685 ఎకరాలు ప్రతిపాదించారు.
నాగార్జునసాగర్ నుంచి సాగర్ ఆయకట్టు, ఎ.ఎం.ఆర్.పి ఆయకట్టు కలిపి 9.16 లక్షల ఎకరాలకు నీరందించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల కింద కూడా ఎక్కువ ఆయకట్టుకు నీరందించడంతోపాటు శ్రీరామసాగర్ అవసరాలకు కూడా మళ్లించనున్నారు. కాళేశ్వరం కింద ఈ ఏడాది ఎక్కువ ఆయకట్టుకు ఇవ్వాలని నిర్ణయించారు. దిగువన ఉన్న మధ్యమానేరులో నీటి నిల్వను పెంచేందుకు బుధవారం రాత్రి నుంచే మేడిగడ్డ నుంచి, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ప్రారంభించారు.
దేవాదుల ఎత్తిపోతల కింద రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రతిపాదించగా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా లక్షా 92 వేల ఎకరాలు, జూరాల కింద 1.09 లక్షలు, నెట్టెంపాడు కింద 1.40 లక్షలు, రాజీవ్‌భీమా కింద 69 వేలు, ఆర్డీఎస్ ద్వారా 42 వేల ఎకరాలకు ఇవ్వనున్నారు. కోయిల్‌సాగర్ ఖరారు చేయాల్సి ఉంది. నిజాంసాగర్ కింద 1.15 లక్షలు, కడెం ప్రాజెక్టు కింద 60 వేల ఎకరాలు, గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా 80 వేల ఎకరాలకు నీరందించనున్నారు. మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఎక్కువ విస్తీర్ణం సాగులోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చారు.
- ఇదీ చదవండి : KTR: తెలంగాణలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతోంది