Water man of India: 'దేశంలో నదులు కలుషితం అవుతున్నాయి. చిన్న నదులు కనుమరుగైపోతున్నాయి. భావితరాలకు ఏం చెబుతాం? అందుకే నదులకు గొంతుక అవుదాం.. వాటికీ మనుషుల్లాగా హక్కులు కల్పించాలి'.. అంటూ మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో నదుల పరిరక్షణ, నదుల మేనిఫెస్టో రూపకల్పనపై రెండు రోజుల జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. హిమాలయ నదీపరీవాహక ప్రాంత మండలి, పెన్సులర్ నదీ పరీవాహక ప్రాంత మండలి ఛైర్మన్లు ఇందిర ఖురానా, వి.ప్రకాశ్‌రావు అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 28 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఇందులో రాజేంద్రసింగ్ మాట్లాడుతూ.. ‘‘దిల్లీ, ముంబయి నగరాల్లో నదీజలాలు కలుషితమయ్యాయి. హైదరాబాద్‌లో మూసీనది దుస్థితి తెలిసిందే. సమస్యపై చైతన్యం కాకపోతే మనల్ని వారసులు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. నదుల సంరక్షణకు ప్రత్యేక విధానాలేవీ లేవు. 1988లో 28 గనులపై సుప్రీంకోర్టులో కేసు వేశా. కోర్టు తీర్పు ఇచ్చినా నేటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. అనేక వివాదాలపై తీర్పులొచ్చినా ఇదే తీరు.. అంబానీ, అదానీలకు సంబంధించిన నిర్ణయాలయితే తెల్లారేసరికల్లా అమలైపోతాయి. రివర్ మేనిఫెస్టో అనేది మనకు మనమే అంకితభావంతో పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అన్ని రాష్ట్రాల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుని దానికి రూపమివ్వడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశం’’ అని రాజేంద్రసింగ్ పేర్కొన్నారు. హిమాలయ, పెన్సులర్ నదీ పరీవాహకాలపై చర్చ సందర్భంగా నదుల అనుసంధానం అవసరంపైనా భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కృష్ణా, గోదావరి జలాల వినియోగం
కృష్ణా జలాలను 57 శాతం పరీవాహకం బయటనే వినియోగిస్తున్నారని కృష్ణా ఫ్యామిలీ ఛైర్మన్ మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. రూ.వేలకోట్లతో ప్రాజెక్టులు నిర్మించి నీటిని ఎత్తిపోస్తున్నా, సద్వినియోగం అనుకున్నంతగా లేదని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ.. తెలంగాణలో గోదావరి 700 కిలోమీటర్లు ప్రవహిస్తున్నా రాష్ట్రం ఏర్పడే నాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మాత్రమే ఉండేదన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలతో గోదావరిని పూర్తిగా వెనక్కు మళ్లించామని, మేడిగడ్డ నుంచి 620 మీటర్ల ఎత్తుకు నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు. విశ్రాంత సీఈ ఐఎస్‌ఎన్ రాజు, ఇస్కీ ఛైర్మన్ రామేశ్వర్‌రావు, దామోదర్‌రెడ్డి, రమణానాయక్, శ్రీనివాస్‌రెడ్డి, రమ తదితరులు పాల్గొన్నారు.
జల వనరుల సంరక్షణలో ఆదర్శం తెలంగాణ: ఎస్.నిరంజన్‌రెడ్డి
మిషన్ కాకతీయ, చెక్‌డ్యాంల నిర్మాణం, ఇంటింటికీ తాగునీటి పథకం మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ ప్రభుత్వం జలవనరుల సంరక్షణలో దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తొలిరోజు సదస్సులో సుజల భారతి వెబ్‌సైట్‌ను రాజేంద్రసింగ్ ప్రారంభించారు. సుజల భారతి జర్నల్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా నదులకు సంబంధించిన వివరాలు, సమాచారం, ప్రజల అభిప్రాయాలను వీటిలో పంచుకోవచ్చని నిర్వాహకులు సూచించారు.
నదుల రక్షణకు పార్టీలు మాటివ్వాలి
నదుల పరిరక్షణకు కృషిచేస్తామని ఎన్నికల్లో పోటీచేసే ప్రతి పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించాలి. నదిని లీగల్ పర్సన్‌గా గుర్తిస్తే ప్రత్యేక హక్కులు సంక్రమిస్తాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో గతంలో కట్ట మైసమ్మ పేరుతో చెరువుండేది. ఇప్పుడది మాయమై కాలనీలు వెలిశాయి. నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది.- మాడభూషి శ్రీధర్, పూర్వ కేంద్ర సమాచార కమిషనర్
ఇదీచూడండి: Pulse Polio 2022: నిండు జీవితానికి రెండు చుక్కలు.. నేడు పల్స్ పోలియో కార్యక్రమం..