ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు కర్మాగారం. 32 మంది ప్రాణ త్యాగాలు, అవిశ్రాంత ఉద్యమాలతో పోరాడి సాధించుకున్న పరిశ్రమగా ఖ్యాతి ఉంది. దేశంలో తీర ప్రాంత ఉక్కు కర్మాగారం ఇదొక్కటే. ఉక్కు పరిశ్రమ అంటే లాభ నష్టాల గణాంకాలు, రాజకీయ సమీకరణాలు కాదు.అమృతరావు వంటి త్యాగధనుల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం. భూమే సర్వస్వంగా భావించే రోజుల్లో పారిశ్రామికీకరణ పై అవగాహన లేని కాలంలో.. వేల మంది తమ సాగు భూములను త్యాగం చేశారు. పునరావాసం, ఉద్యోగం హామీతో. నామమాత్రపు పరిహారం తీసుకుని.. సరికొత్త అధ్యాయానికి నాటి రైతులు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి అనేక అడ్డంకుల్ని అధిగమిస్తూ.. ఆటుపోట్లను తట్టుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్... ప్రైవేటుకి దీటుగా నిలిచింది. కానీ ప్రస్తుతం నష్టాల పేరుతో తన ఉనికిని ప్రశ్నార్థక స్థితిలో నిలుపుకుంది.
అప్పుడే బీజం..
ప్రైవేటు సవాళ్లు విశాఖ ఉక్కుకు కొత్తేంకాదు. వాజ్‌పేయీ హయాంలోనూ ప్రైవేటు ఉచ్చు బిగించే ప్రయత్నం జరిగింది. నాటి సీఎం చంద్రబాబు, ఎంపీలు ఎర్రంనాయుడు, ఎంవీవీఎస్ మూర్తి పోరాట ఫలితంగా ఆ గండం తప్పింది. వాజ్ పేయీ సానుకూల దృక్పథంతో స్టీల్ ప్లాంట్ కు ఆర్థికంగా అందించిన చేయూత...తర్వాతి కాలంలో పరిశ్రమ వేల కోట్ల రూపాయల లాభాల్లోకి వెళ్లేందుకు సహకరించింది. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరుకున్నా.. పరిశ్రమకు కనీస అవసరమైన ఇనుప ఖనిజ గనుల కేటాయింపు జరగలేదు. సొంత గనులు లేక ఏటా పడే ఆర్థిక భారం 3వేల కోట్ల రూపాయలకు పైమాటే. రుణాలకు జతవుతున్న వడ్డీల భారం స్టీల్ ప్లాంట్ ను ఆర్థికంగా కుంగదీసింది. అయినప్పటికీ ఉత్పత్తి, మార్కెటింగ్ సంబంధిత అంశాల్లో విశాఖ ఉక్కు ఇప్పటికీ ఎంతో పటిష్ఠంగా ఉంది. కొవిడ్ కాలంలో అన్ని పరిశ్రమలు నష్టాల బాట పడితే.. ఇక్కడ మాత్రం 200 కోట్ల రూపాయల మేర లాభాలు వచ్చాయి.
యువత కలల కొలువు
విశాఖ ఉక్కు నాణ్యతలో రారాజు.. ఉద్యోగులకు అద్భుత జీవన ప్రమాణాలు అందించే విషయంలోనూ మేటి. అందుకే జీవితంపై ఎన్నో కలలతో ఇక్కడ కొలువు సాధించేందుకు యువత పోటీ పడతారు. ఒక పరిశ్రమగా తాను ఎదుగుతూనే అనేక అనుబంధ పరిశ్రమలకు ఊతమిచ్చింది. విశాఖ నగరాభివృద్ధిలోనూ స్టీల్ ప్లాంట్ భాగస్వామ్యాన్ని వెలకట్టలేం. ఆర్ఐఎన్ఎల్ పరిరక్షణ దిశగా జరుగుతున్న ప్రస్తుత ఉద్యమాలు ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయడమే కాక.. మౌలికంగా పరిశ్రమ ఎదుర్కొనే వివిధ సమస్యలను పరిష్కరించే దిశగా మార్గాలు చూపాలని కార్మికవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదీ చదవండి: 'ఫలితాలు తారుమారు చేశారు.. చర్యలు తీసుకోండి'