పెన్సిల్ లెడ్తో సూక్ష్మ ఆకృతిలో పేర్లు, బొమ్మలు చెక్కుతున్నాడు విశాఖకు చెందిన గోపాల్. విశాఖ పూతినవారి మాన్యంలో నివాసం ఉంటున్న ఈ యువకుడు... ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కరోనా కారణంగా వచ్చిన సెలవుల్లో ఇంట్లో ఉన్న గోపాల్.. తన సృజనకు పదువుపెట్టాడు. పెన్సిల్ లెడ్తో ఆర్ట్స్ చేయడం మొదలుపెట్టాడు.
పెన్సిల్ లెడ్‌పై అన్ని రాష్ట్రాల పేర్లు
గతంలో ఏ నుంచి జెడ్ వరకు లెడ్‌పై అక్షరాలు చెక్కి... ఓ వ్యక్తి వరల్డ్ రికార్డు సాధించాడు. ఆ రికార్డు అధిగమించే ఉద్దేశంతో పెన్సిల్ లెడ్‌పై 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు చెక్కాడు. దీనిని వజ్రా వరల్డ్ రికార్డ్సు సంస్థ గుర్తించింది. ఇండియా బుక్ రికార్డ్స్‌లోనూ స్థానం పొందాడు. కరోనాలోనూ తన కష్టానికి ఒక ప్రతిఫలం దక్కిందని గోపాల్ చెప్తున్నాడు. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ప్రయత్నాలు చేస్తున్నానని గోపాల్ అంటున్నాడు.
పదో తరగతి చదువుతున్న సమయంలో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ కళను నేర్చుకున్నానని గోపాల్ తెలిపాడు. సరదాగా మొదలుపెట్టిన ఈ కళతో రికార్డులు అందుకోవటం ఆనందంగా ఉందన్నాడు. తమ కుమారుడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంపై కుటుంబసభ్యులు సంబరపడుతున్నారు.