Vijaya Palm Oil Price: రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య(ఆయిల్‌ఫెడ్) విజయ బ్రాండు పేరుతో విక్రయించే పామాయిల్ లీటరు ధరను ఏకంగా రూ.165 చేసింది. సరిగ్గా 2 నెలల క్రితం దీని ధర రూ.126 మాత్రమే. యుద్ధంతో ఉక్రెయిన్, రష్యాల నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లోకి పొద్దుతిరుగుడు నూనె రావడం తగ్గిపోవడంతో దీనికి డిమాండు పెరిగింది. ఆయిల్‌పాం పండ్లగెలలను గానుగాడి పామాయిల్ ఉత్పత్తి చేస్తారు. తాజాగా ఈ నెలలో రైతులకు చెల్లించే టన్ను ఆయిల్‌పాం గెలల ధరను ఆయిల్‌ఫెడ్ రూ.19,500కి పెంచింది. జనవరిలో ఈ ధర రూ.17,400 కాగా గతేడాది ఈ సమయంలో రూ.14,416 చెల్లించారు. టన్ను(వెయ్యి కిలోల) గెలలను గానుగాడితే సగటున 195 కిలోల పామాయిల్ ఉత్పత్తవుతోంది. ఎకరానికి సగటున రూ.30 వేల నుంచి 40 వేల దాకా రైతులు పెట్టుబడి పెడుతున్నారు. ఎకరానికి సగటున 14 టన్నుల గెలల దిగుబడి వస్తున్నట్లు ఆయిల్‌ఫెడ్ తాజా అధ్యయనంలో తేలింది. అన్ని ఖర్చులు పోనూ ప్రస్తుత ధరల్లో రైతుకు ఎకరానికి రూ.లక్షన్నర వరకూ లాభం వస్తోందని ధర పెరిగే కొద్దీ లాభం ఇంకా పెరుగుతుందని వివరించింది. పామాయిల్‌కు మనదేశంలో తీవ్ర కొరత ఉన్నందున మలేసియా, ఇండోనేసియాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజల వినియోగానికి ఏటా 3.66 లక్షల టన్నులు అవసరమవగా ప్రస్తుతం 45 వేల టన్నులే తెలంగాణలో ఉత్పత్తవుతోంది.
నారు కొరత...
వచ్చే ఏడాది(2022-23)లోగా రాష్ట్రంలో కొత్తగా 5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం మొక్కలు నాటించి సాగు ప్రారంభించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖను ఆదేశించింది. అవసరమైన నారును కోస్తారికా, మలేసియా, థాయ్‌లాండ్ తదితర దేశాల నుంచి పామాయిల్ కంపెనీలు దిగుమతి చేసుకుని నర్సరీల్లో పెంచుతున్నాయి. జిల్లాలవారీగా సాగు బాధ్యతను పామాయిల్ కంపెనీలకు టెండర్ల ద్వారా ఉద్యానశాఖ అప్పగించింది. ఈ కంపెనీలే విదేశాల నుంచి నారు దిగుమతి చేసుకుని ఏడాదికి పైగా నర్సరీల్లో పెంచి రైతులకు మొక్కలు ఇవ్వాలి. కానీ విదేశాల నుంచి నారు సులభంగా దొరకడం లేదని, ఇప్పుడు ఆర్డర్ ఇస్తే ఆరునెలల తర్వాత అక్కడి కంపెనీలు నారు పంపుతున్నాయని ఓ పామాయిల్ కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఇక్కడే ఆయిల్‌పాం నారు పెంచేలా ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనలు చేస్తే రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల రైతులకు సైతం ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం పూర్తిగా విదేశీ కంపెనీలపైనే నారు కోసం ఆధారపడటం వల్ల అవసరమైనంత దొరక్క ఇబ్బందులు పడుతున్నామని, దీనివల్ల పంట సాగు విస్తీర్ణం పెంపు అంత సులభం కాదని వివరించారు.
ఇదీ చూడండి: