ఏపీ పుర, నగర పాలక ఎన్నికల్లో.. ఛైర్మన్, మేయర్ పదవి రేసులో ఉన్న కొందరు అభ్యర్థులను దురదృష్టం వెంటాడింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో.. మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి కోడలు సత్యశైలజ.. వైకాపా తరఫున ఛైర్ పర్సన్‌గా ప్రచారం సాగగా.. స్వతంత్ర అభ్యర్థి లక్ష్మి చేతిలో 181 ఓట్ల తేడాతో ఓడారు. చిత్తూరు 20వ డివిజన్‌లో వైకాపా గుర్తుతో బరిలో నిలిచిన ప్రేమ్ కుమార్.. మేయర్ అభ్యర్థిగా ప్రచారం జరిగింది. సచివాలయ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ పోటీలో నిలిచిన ప్రేమ్ కుమార్.. తెలుగుదేశం అభ్యర్థి అశోకన్ చేతిలో 178 ఓట్ల తేడాతో ఓడారు. కడప జిల్లా మైదుకూరులో తెదేపా ఛైర్మన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న ధనపాల జగన్.. ఓటమి చవిచూశారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా అద్దంకి నగర పంచాయతీ ఛైర్ పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఇక్కడ వైకాపా తరఫున ఛైర్ పర్సన్ రేసులో ఉన్న మట్టిగుంట లక్ష్మీలావణ్య, జెన్నిపోగు మణెమ్మ ఓడిపోయారు. ఫలితంగా.. 18వ వార్డులో గెలిచిన లాక్కెబోయిన ఎస్తేరమ్మను అనుకోని అదృష్టం వరించినట్లయింది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో.. ఛైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మహాలక్ష్మి, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి సాయివినీత.. వైకాపా గుర్తుతో బరిలో దిగి ఓడారు. అనంతపురం జిల్లాలో హిందూపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం పురపాలికల్లో.. తెదేపా తరఫున ఛైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేసిన ముగ్గురూ ఓడిపోయారు.
విజయనగరంలోనూ అదే పరిస్థితి..
విజయనగరం తెదేపా మేయర్ అభ్యర్థినిగా ప్రచారంలో ఉన్న శమంతకమణి.. సాలూరు పురపాలక ఛైర్ పర్సన్‌గా ప్రచారంలో ఉన్న విజయకుమారిదీ అదే పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో తెదేపా నుంచి ఛైర్ పర్సన్‌గా ప్రచారంలో నిలిచిన కోలా లక్ష్మీ పరాజయం చవిచూశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తెదేపా ఛైర్ పర్సన్ అభ్యర్థి తిరుమాని శశిదేవి., నిడదవోలులో ఛైర్మన్ అభ్యర్థి కొమ్మిన అప్పారావు ఓటమిని చవిచూశారు.
నాయకుల బంధువుల విజయకేతనం..
ఇక.. ఎన్నికల్లో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల కుటుంబసభ్యులు విజయకేతనం ఎగురవేశారు. విశాఖ కార్పొరేషన్‌లో.. మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ఆరో డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి భార్య, కుమారుడు, నర్సీపట్నం పురపాలికలో కౌన్సిలర్లుగా విజయం సాధించారు. గాజువాక ఎం.ఎల్.ఏ తిప్పల నాగిరెడ్డి కుమారుడు విశాఖలో కార్పొరేటర్‌గా గెలిచారు. నంద్యాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి సతీమణి కౌన్సిలర్‌గా ఏకగ్రీవమయ్యారు.
వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వదిన అనూష.. విశాఖ నగరపాలక సంస్థలో 68 వార్డు నుంచి గెలిచారు. విజయవాడ కార్పొరేషన్‌లో 11వ డివిజన్ నుంచి తెదేపా ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత.. విజయం సాధించారు. వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ పలాస పురపాలికలో.. 17 వార్డు కౌన్సిలర్‌గా గెలిచారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీలో.. ఎమ్మెల్యే విడదల రజినీ మరిది గోపి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. తిరుపతి నగరపాలక సంస్థ 4వ డివిజన్ నుంచి.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కొన్ని చోట్ల కీలక నేతల సంబంధికులు ఓటమి చవిచూశారు. విశాఖలో 75వ డివిజన్ నుంచి వైకాపా గుర్తుతో పోటీ చేసిన గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కోడలు జ్వాల.. ఓటమిపాలయ్యారు. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతంరెడ్డి కుమార్తె లిఖితారెడ్డి.. విజయవాడ నగరపాలిక 28వ డివిజన్‌లో పరాజయం చవిచూశారు.
- ఇవీ చదవండి : మండలి ఎన్నికల్లో 70.61శాతం పోలింగ్