వెయ్యి ఎకరాల భూమి.. 1.67 లక్షల చదరపు గజాల ఇళ్ల స్థలాలు.. 27 ఇళ్లు.. ఇవన్నీ కరుడుగట్టిన నేరగాడు నయీం(Nayeem Case) ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు. 2016లో ఆయన ఎన్‌కౌంటర్ అనంతరం.. బాధితులంతా ఊపిరి పీల్చుకున్నారు. న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో పోలీస్‌స్టేషన్లకు బారులు తీరారు. ఆ ముఠా కబ్జా చేసిన తమ ఆస్తుల వివరాలతో ఫిర్యాదులు చేశారు. ఇలా ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 256 కేసులు నమోదయ్యాయి. బాధితులంతా ఇక తమ ఆస్తులు తమకు వస్తాయని ఆశపడ్డారు. నయీం(Nayeem Case) హతమై ఐదేళ్లు గడుస్తున్నా ఈ కేసుల విచారణలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. బాధితుల్లో మూడొంతుల మంది వృద్ధ్యాప్యానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తాము బతికుండగా తమ ఆస్తులు తమకు దక్కుతాయా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇంకా 64 కేసుల్లో దర్యాప్తు పూర్తి కాలేదు. దర్యాప్తు పూర్తయితే కానీ న్యాయస్థానంలో విచారణ మొదలుకాదు. ఇది కూడా పూర్తయ్యాకే బాధితులకు న్యాయం జరిగేది. సాంకేతిక కారణాలతోనే దర్యాప్తు ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. ‘‘బెదిరించి, భయపెట్టి బాధితుల ఆస్తులను నయీం(Nayeem Case) తన బినామీల పేర్లమీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇది అక్రమంగా లాక్కున్నదని న్యాయస్థానంలో నిరూపిస్తేగానీ బాధితులకు న్యాయం జరగదు. ఇందుకోసం ప్రతి సేల్‌డీడ్‌ని క్షుణ్నంగా చదివి, బాధితులను నయీం బెదిరించి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆధారాలు సేకరించాలి. ఈ క్రమంలో దర్యాప్తు ఆలస్యమవుతోంది’’ అని సిట్ అధికారులు చెబుతున్నారు. కారణాలేవైనా అయిదేళ్లుగా దర్యాప్తు కొలిక్కి రాకపోవడంపై వందలాది మంది బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీసం దర్యాప్తు పూర్తయిన కేసుల్లో అయినా న్యాయ విచారణ మొదలుపెట్టాలని కోరుతున్నారు.
ఏం జరుగుతుందో తెలియడంలేదు..
‘‘నలుగురు భాగస్వాములకు చెందిన మా 27 ఎకరాల భూమిని నయీం బలవంతంగా తన బినామీల పేర్లమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్రాణభయంతో అప్పట్లో ఏం చేయలేకపోయాం. నిందితుడి ఎన్‌కౌంటర్ తర్వాత మా భూమిని ఇప్పించమని పోలీసులకు ఫిర్యాదు చేశాం. రోజులు సంవత్సరాలవుతున్నాయి. అసలు మాకు న్యాయం జరుగుతుందో లేదో తెలియడంలేదు’’ అని భువనగిరికి చెందిన బాధితుడు శ్యాంసుందర్ ఘటాని వాపోయారు.
- ఇదీ చదవండి : అవినీతి కేసులో మాజీ హోంమంత్రి సహాయకుల అరెస్ట్!