స్వర్ణభారత్ ట్రస్టు విజయవాడ చాప్టర్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ధ్రువీకరణ పత్రాలను ప్రదానం చేశారు. కరోనా మహమ్మారి ప్రపంచం మీద తీవ్ర ప్రభావం చూపించిందని... అభివృద్ధి గమనంలో మహమ్మారి అనేక దారులను మూసేసిందన్నారు. అదే సమయంలో కొత్త దారులను కూడా తెరిచిందన్నారు. వాటిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలనే దానిపైనే యువత దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఆన్‌లైన్ శిక్షణ ద్వారా లాక్‌డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించిన తీరు అభినందనీయమన్నారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు యువత ఉన్నారని.. మొత్తం జనాభాలో సగానికి పైగా మహిళలున్నారని తెలిపారు. ప్రతిభావంతులైన యువత శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని, దేశాభివృద్ధిలో యువతరం, మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడం ద్వారా అభివృద్ధి వేగాన్ని పెంచేందుకు అవకాశం ఉందని సూచించారు.
అపారమైన మానవ వనరులు భారతదేశానికి సహజమైన శక్తిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి.. ఈ శక్తిని సద్వినియోగం చేసుకుంటూ వారిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. వీటిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. దేశంతో పాటు ప్రపంచం ఎదుర్కొనే భవిష్యత్ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అవసరమైన నైపుణ్యాన్ని అందించాలన్నారు. ఈ దిశగా ప్రైవేటు రంగం కూడా తన బాధ్యతను స్వీకరించాలన్నారు. రైతులు, మహిళలు, యువత అభివృద్ధి, వారికి సాధికారత కల్పించడంపైనే స్వర్ణభారత్ ట్రస్టు ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. ఒక పూట అన్నం పెట్టడం కాదు... రోజూ అన్నం సంపాదించుకునే స్వశక్తిని పెంపొందించుకునే నైపుణ్య శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఇప్పటి వరకూ వేల మంది యువత స్వర్ణభారత్‌లో నైపుణ్య శిక్షణ పొంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, అదే విధంగా ఎంతో మంది మహిళలు ఇక్కడ శిక్షణ పొంది, తమ కాళ్ల మీద తాము నిలబడే సాధికారత సంపాదించారని తెలిపారు.
ఇదీ చూడండి: కేసీఆర్ కీలక నిర్ణయం... జలవనరుల శాఖకు కొత్త స్వరూపం