నేత్రదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న సక్షమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సందర్భంగా అంతర్జాల వేదికగా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. నేత్రదానాన్ని శ్రేష్ఠమైన దానంగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి.. సమాజానికి మనమిచ్చే అత్యున్నతమైన కానుకల్లో నేత్రదానం ఒకటన్నారు.
మనదేశంలో నేత్రదానం చేసేవారి సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి... ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, జిల్లా స్థాయిలో వైద్య వ్యవస్థలో మౌలికసదుపాయాలను కల్పించడం ద్వారా అవయవాల దానం, మార్పిడిని ప్రోత్సహించాలని సూచించారు.