MLA Ram narayana Reddy: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజన తీరుపై నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమశిల, కండలేరు జలాశయాలు 2 జిల్లాల పరిధిలోకి వస్తున్నాయని.. ఫలితంగా నీటి వివాదాలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోవటం, ప్రజాప్రతినిధులతో చర్చించకుండా విభజన చేయటం సరికాదని వ్యాఖ్యానించారు.
"రాపూరు, కలువాయి, సైదాపురాన్ని నెల్లూరులోనే ఉంచాలంటున్నారు. బాలాజీ జిల్లాలో చేరడం మూడు మండలాల ప్రజలకు ఇష్టం లేదు. సీఎం జగన్, ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. 2009 విభజన ప్రక్రియలోనూ రాపూరుకు అన్యాయం చేశారు. విభజన ప్రక్రియలోని లోపాలను సరిదిద్దకుంటే అన్నివిధాలా నష్టమే" - ఆనం రాంనారాయణరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే, వెంకటగిరి
వేగంగా ప్రణాళికలు..
AP New Districts: మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మార్చి 18 నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా అధికారులు ప్రణాళికను రూపొందించారు. అదేరోజు నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు పనిచేయనున్నారు. పాత జిల్లాలకు కూడా వీరే ఇన్‌ఛార్జి కలెక్టర్లుగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రకటించిన కొత్త జిల్లాలకు ఉద్యోగులు, అధికారులను కేటాయించడం, మౌలిక వసతుల కల్పన, ఇతర చర్యలు పూర్తయ్యేంత వరకూ వీరే పాత జిల్లాల బాధ్యతలను నిర్వర్తించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ పాత జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చినా విభజన, మౌలిక వసతుల కల్పన తదితర వ్యవహారాలను వీరే పర్యవేక్షిస్తారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
- కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్లు, సవరణ ఉత్తర్వులపై జిల్లాల కలెక్టర్లు ప్రజల నుంచి సలహాలు, సూచనలను వచ్చే నెల 3వ తేదీ వరకు స్వీకరిస్తారు. వీటిని ఈ నెల 16 నుంచి సీఎఫ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో తయారయ్యే సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలి.
- జిల్లాల నుంచి వచ్చే నివేదికలను సీసీఎల్‌ఏ, ప్రణాళిక శాఖాధికారులు మార్చి 10వ తేదీ వరకు పరిశీలిస్తారు. మరుసటిరోజు నివేదిక రూపంలో వివరాలను సచివాలయంలోని బిజినెస్ నిబంధనలు రూపొందించే వారి పరిశీలనకు పంపిస్తారు.
- మార్చి 15 నుంచి 17 మధ్య తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు.
- దీనికి అనుగుణంగా మార్చి 18న జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తారు.
- ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
అభ్యంతరాలపై..
కొత్తగా ప్రకటించిన జిల్లా, రెవెన్యూ డివిజన్ కేంద్రాలపై వస్తున్న అభ్యంతరాలు, సూచనలపై రాజకీయ కోణంలోనే నిర్ణయాలు ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ‘జిల్లాల్లో అందచేసే అభ్యంతరాలు స్వీకరించి, అభిప్రాయాలతో పంపండి. మాట్లాడాల్సి వస్తే..సంయమనం పాటించండి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని జిల్లా అధికారులకు సూచనలు వెళ్లాయి. మరోవైపు వచ్చే మంత్రివర్గ సమావేశంలోనూ మంత్రులు వీటి గురించి ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. అలాగే శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సీఎం నేరుగా తెలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
జిల్లా కలెక్టరేట్‌లో..
జిల్లా కలెక్టరేట్‌లో ప్రస్తుతం వివిధ హోదాల్లో 165 మంది అధికారులు, ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీరిలో కలెక్టర్ నుంచి డ్రైవర్, అటెండర్ వరకు ఉన్నారు. ఈ సంఖ్యను 158 మందికి పరిమితం చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కాకుండా ముగ్గురు జాయింట్ కలెక్టర్లు (కేడర్ పోస్టులు) ఉన్నారు. ఈ సంఖ్యను రెండింటికి పరిమితం చేయనున్నారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న 32 మంది యథావిధిగా కొత్తగా ఏర్పడే రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఉంటారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒక జిల్లా కేంద్రంలో కనీసం 80 శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఉంటారు.
ఇదీ చదవండి: KTR Comments on Modi : 'మోదీకి మరో అవకాశమిస్తే.. తెలంగాణ-ఆంధ్రాను కలిపేస్తారు'