విరసం నేత, సామాజిక ఉద్యమకారుడు వరవరరావుపై కర్ణాటక కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. 2005లోని ఓ కేసులో కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా మధుగిరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. 2005లో తుమకూరులో పోలీసులపై దాడి కేసులో వరవరరావు, గద్దర్ సహా మరికొందరు నిందితులుగా ఉన్నారు.
2005 ఫిబ్రవరి 6న మావోయిస్టు నాయకుడు సాకేత్ రాజన్ అలియాస్ ప్రేమ్ కర్ణాటకలోని చిక్‌మంగళూరు ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. దీనికి ప్రతికారంగా కర్ణాటక పావగడలోని కేఎస్ఆర్పీ క్యాంపుపై 2005 ఫిబ్రవరి10న మావోయిస్టులు దాడిచేశారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు సహా ఒక పౌరుడు మరణించాడు. ఈ కేసులో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై వరవరరావు, గద్దర్ గతంలో అరెస్టయ్యారు.
మధుగిరి కోర్టు జారీచేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌పై కర్ణాటక హైకోర్టును ఆశ్రయిస్తామని వరవరరావు తరఫు న్యాయవాది తెలిపారు. ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన వరవరరావు.. ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్‌పై ఉన్నారు.
ఎల్గార్ పరిషద్ కేసు ఏంటీ..
మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్‌లో (Bhima Koregaon) 2018 జనవరిలో చోటుచేసుకున్న అల్లర్లలో మావోయిస్టుల కుట్ర ఉందని పుణెలో పోలీసులు కేసు నమోదు చేశారు. 2017 డిసెంబరు 31న ఎల్గార్ పరిషద్ అనే సంస్థ పుణెలో నిర్వహించిన కార్యక్రమం వెనుక మావోయిస్టులు ఉన్నారని, ఇక్కడ జరిగిన ప్రసంగాలే మర్నాడు బీమా కోరేగావ్ అల్లర్లకు (Bhima Koregaon case) కారణమయ్యాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2018 జూన్‌లో దేశవ్యాప్తంగా ఆరుగుర్ని అరెస్టు చేశారు. ఇందులో దిల్లీకి చెందిన పౌరహక్కుల నేతలు రోనా విల్సన్, రోనా జాకొబ్, దళిత హక్కుల నాయకుడు ఎల్గార్ పరిషద్‌కు చెందిన సుధీర్ ధవాలె, షోమ సేన్, మహేష్ రౌత్, న్యాయవాది సరేంద్ర గాడ్లింగ్‌లు ఉన్నారు.
లేఖ ఆధారంగా అరెస్ట్
ఈ సందర్భంగా విల్సన్ ఇంట్లో మూడు లేఖలు స్వాధీనం చేసుకున్నామని, వాటిలోని ఒకదాన్లో ప్రధాని మోదీరాజ్‌కు చరమగీతం పాడేందుకు వీలైతే రాజీవ్‌గాంధీ తరహాలో అంతమొందించాలని ఉందని పోలీసులు వెల్లడించారు. మరో లేఖలో వరవరరావు పేరు ఉందని, దేశవ్యాప్తంగా దాడులు జరిపే బాధ్యతలను వరవరరావుకు అప్పగించారని పోలీసులు తెలిపారు. ఈ లేఖ ఆధారంగా 2018 ఆగస్టులో ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్లారు.
సంబంధిత వార్తలు: