రామోజీ ఫిల్మ్‌సిటీలోని 'ఈటీవీ భారత్' ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్. ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈనాడు, ఈటీవి, రామోజీ ఫిల్మ్‌సిటీ, ఈటీవీ భారత్‌తో తన ప్రయాణాన్ని రీఫ్‌మన్‌కు రామోజీరావు వివరించారు.
అనంతరం కాన్సులేట్ ప్రజాసంబంధాల అధికారి డ్ర్యూ గిబ్లిన్, మీడియా సలహాదారు మహ్మద్ బాసిత్‌తో కలిసి 'ఈటీవీ భారత్' కార్యాలయాన్ని సందర్శించారు రీఫ్‌మన్. 13 భాషల్లో వార్తలను అందిస్తోన్న 'ఈటీవీ భారత్' యాప్‌కు సంబంధించిన వివరాలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాపినీడు చౌదరి, ఎడిటోరియల్ సిబ్బంది, సాంకేతిక నిపుణులు... రీఫ్‌మన్ బృందానికి వివరించారు.
యాప్ విభాగంలో భారత్‌లో మొట్టమొదటిసారి అతిపెద్ద వార్తా స్రవంతిని సృష్టించడం పట్ల రామోజీరావును అభినందించారు రీఫ్‌మన్. వేలమంది యువతకు ఉద్యోగాలు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వార్తల పోకడలు మారాయని, నూతన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ వేగవంతమైన, విశ్వసనీయమైన వార్తలను అందించేవారు విజయం సాధిస్తారని పేర్కొన్నారు. యువ జర్నలిస్టులతో మాట్లాడిన కాన్సులేట్ జనరల్... వారితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని మెరుగైన పనితీరు కనబరచాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ప్రశాంతంగా జరిగితే.. ఏపీలో రచ్చ జరుగుతోంది..