రాష్ట్రంలోని యువత నైపుణ్యాల అభివృద్ధికి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) డిజిథాన్ చేస్తున్న కృషికి మరో విశిష్ట గుర్తింపు దక్కింది. ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీలలో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్... టీటా అందిస్తున్న కృత్రిమ మేథస్సు శిక్షణను అభినందించింది. కృత్రిమ మేథస్సుపై శిక్షణలో టీటా కార్యాచరణ అభినందనీయమని ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వాన్ని సైతం కొనియాడింది.
ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌కు యూటీడీ లేఖ రాసింది. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల, ఆయన బృందం చేస్తున్న కృషి... భవిష్యత్తులో నైపుణ్యవంతులను తీర్చిదిద్దేందుకు సహకరిస్తుందని తెలిపింది. రాష్ట్ర యువతకు కృత్రిమ మేథస్సు నైపుణ్యాలు అందించేందుకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్‌తో కలిసి టీటా ఇటీవలే శిక్షణ ప్రారంభించింది. ఇప్పటికీ 3 బ్యాచులు శిక్షణ పూర్తి చేసుకున్నాయి. టీటా డిజిథాన్ శిక్షణను యూటీడీ యూనివర్సిటీ ప్రత్యేకంగా ప్రశంసించింది.
కృత్రిమ మేథస్సు రంగంలో తమ శిక్షణను గుర్తించి... ప్రశంసించిన యూటీడీకి టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్... ఇయర్ ఆఫ్ ఏఐ-2020ని ప్రకటించి ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. 2022 నాటికి లక్ష మంది కోడర్స్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సందీప్ కుమార్ మక్తాల ప్రకటించారు. ఈ శిక్షణ పొందాలనే ఆసక్తి కలిగిన వారు bit.ly/digithon_academyలో నమోదు చేసుకోవచ్చని... లేదా 6300368705 ద్వారా సంప్రదించవచ్చని వివరించారు.