రైతులు ధైర్యంగా సాగు చేయాలనే లక్ష్యంతో నూతన సాగు చట్టాలు తీసుకొచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో వ్యవసాయ రంగానికి విపరీతమైన విద్యుత్ కోతలు ఉండేవని, ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు లేవని అన్నారు. వన్ నేషన్-వన్ గ్రిడ్ కింద విద్యుత్ సమస్యను పరిష్కరించామన్న కేంద్ర మంత్రి.. సకాలంలో రైతులకు ఎరువులు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
శీతల గిడ్డంగుల కోసం కేంద్ర ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు చేసిందని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా బిందు సేద్యం ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులకు సాగుపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక టీవీ ఛానల్ ఏర్పాటు చేశామన్న కిషన్ రెడ్డి.. కిసాన్ ఛానల్ ద్వారా వ్యవసాయ రంగానికి చెందిన సమగ్ర సమాచారం అందిస్తున్నామన్నారు. సాగు చట్టాలపై ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టమైన వైఖరి చెప్పారని తెలిపారు.
ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వాస్తవ విషయాలను రైతులకు తెలియజేయాలని నిర్ణయించాం. ప్రధాని మోదీని ఎదుర్కొనలేక రైతులను, రైతు సంఘాలను కొందరు రెచ్చగొట్టి... ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు. వాస్తవానికి ఈ ఉద్యమం పంజాబ్‌కే పరిమితమైనప్పటికి...కొన్ని ప్రచార మాధ్యమాల్లో రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. రైతుల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన పార్టీ.. రైతులకు నష్టం కలిగించే ఏ ఒక్క నిర్ణయం కలలో కూడా తీసుకోము. రైతు ధైర్యంతో వ్యవసాయం చేయనంత వరకు ప్రపంచంతో పోటీ పడలేం.
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి