రాష్ట్ర విభజన సందర్భంగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్) కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుందని మంగళవారం.. కేంద్రం ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదంపై.. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్, తమతో ఏకీభవించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మాటమార్చినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. గతంలో చేసిన కేటాయింపులను రద్దు చేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ.. కేంద్ర ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. అయితే ఒక్కో అప్పీలుపై వాదనలు వినిపించాలనడం వల్ల తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేటాయింపునకు సంబంధించిన పిటిషన్‌పై అదనపు సొలిసిటర్ జనరల్ టి సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తప్పుపట్టారు. అధికారుల కేటాయింపు కేంద్రం పరిధిలోనిదంటూ క్యాట్ లో అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వ్యతిరేకిస్తోందన్నారు. క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలో పనిచేస్తున్న సోమేశ్‌కుమార్ సహా పలువురు అధికారులు ఏపీకి కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లయితే ఇక్కడ పాలన కుంటుపడుతుందన్న రాష్ట్ర వాదన సరికాదన్నారు. కేటాయింపుల ప్రకారం వారిని ఏపీకి పంపినా ఇక్కడేమీ పరిపాలన స్తంభించిపోదన్నారు. సంబంధిత అధికారులు తెలంగాణలోనే ఉండాలని కోరుకున్నట్లయితే అంతర్ రాష్ట్ర కేడర్ బదిలీని కోరవచ్చన్నారు. క్యాట్ ఉత్తర్వులతో తమకు నచ్చిన రాష్ట్రంలోనే ఉన్న అధికారుల విజ్ఞప్తులు, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోరాదని కోరారు. అధికారుల విభజన కోసం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ.. మార్గదర్శకాలను రూపొందించిందని, దీని ప్రకారం 700 మందికి పైగా అధికారుల విభజన జరిగిందని, అయితే కేవలం కొంత మంది మాత్రమే విభేదించి కోర్టులను ఆశ్రయించారన్నారు. కొంత మందికి అనుకూలంగా క్యాట్ తీర్పు వచ్చిందన్నారు. అయితే కేంద్ర సర్వీసు నిబంధనలు, చట్ట ఉల్లంఘన జరిగిందని పేర్కొన్నా.. ఎక్కడ ఉల్లంఘన జరిగిందో చెప్పలేదన్నారు. సీఎస్ సోమేశ్‌కుమార్ తరఫున వాదనలు వినేందుకు... తదుపరి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి విచారణ వాయిదా వేసింది.
ఇదీచూడండి: Paddy Procurement: ధాన్యం కొనడమా?.. కొనిపించడమా..?