తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సర్వీసును రెండేళ్లు పొడిగించింది. పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దస్త్రంపై సంతకం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు సుదీర్ఘకాలం సమ్మె చేశారు. సమ్మె విరమణ అనంతరం ముఖ్యమంత్రి వారితో ఆత్మీయ సమావేశం నిర్వహించి పదవీ విరమణ వయసు పెంచుతామని హామీ ఇచ్చారు.
దస్త్రంపై సీఎం సంతకం
ఆర్టీసీ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఇందుకు సంబంధించిన దస్త్రంపై సీఎం సంతకం చేశారు. దీనిపై ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. పెంపుదల ఏ నెల, ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనేది ఉత్తర్వులు వెలువడ్డాకనే తెలుస్తుందని ఒక ఉన్నతాధికారి చెప్పారు. ఆర్టీసీలో అధికారుల నుంచి శ్రామిక్ వరకు అన్ని స్థాయుల వారికి ఈ పెంపుదల వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.
అయిదేళ్లలో 9,375 మంది ఉపయుక్తం
పదవీ విరమణ వయసు పెంపుదల నిర్ణయంతో సూపర్‌వైజర్ల నుంచి గ్యారేజీ సిబ్బంది వరకు వచ్చే అయిదేళ్లలో 9,375 మందికి ఉపయుక్తం కానుంది. ప్రస్తుతం 49,733 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ సంవత్సరంలో 659 మంది పదవీ విరమణ చేశారు. 2020లో 1,956 మంది, 2021లో 2,075, 2022లో 2,360, 2023 సంవత్సరంలో 2,325 మంది పదవీ విరమణ చేయాల్సి ఉంది.
ఇవీ చూడండి: సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ, ఆర్టీసీ అధికారులు