ఒకవైపు కరోనా భయం, మరో వైపు నివర్ తుపాను ప్రభావంతో 9 రోజులుగా ఘాట్లకు భక్తులు పెద్దగా రాలేదు. కార్తిక మాసం కావటం, ఆదివారం పౌర్ణమి రావటం వల్ల అంతటి పవిత్రమైన రోజున నదీ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయనే నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున పుష్కర ఘాట్లకు తరలివచ్చారు. ఏపీలోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, సంకల్‌బాగ్ ఘాట్లలో భక్తుల సందడి నెలకొంది. మిగిలిన ఘాట్లకూ భక్తులు పెరిగారు.
సంకల్ బాగ్ పుష్కర ఘాట్లో అనాథ బాలలకు పుష్కర భాగ్యాన్ని పోలీసులు కల్పించారు. ఉదయం నుంచి హోమం నిర్వహించారు. సాయంత్రం వేద పండితులు నదీమతల్లికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పంచహారతి ఇచ్చారు. జన్మ, నామ, నక్షత్రాది దోషాలను తొలగించే నక్షత్ర హారతులు ఇచ్చారు. అనంతరం వేద పండితులు నదీ జలాన్ని భక్తులపై ప్రోక్షణ చేసి వేదాశీస్సులు అందించారు.
కార్తిక సోమవారం పదకొండో రోజు సైతం భక్తులు భారీగా వస్తారని అధికారులు భావిస్తున్నారు. మంగళవారంతో పుష్కరాలు ముగియనున్నాయి.
ఇదీ చూడండి: పుష్కరఘాట్లో మహిళను కాపాడిన పోలీసులు