ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల సంపూర్ణ స్వచ్ఛతను క్రమేణా సాధిస్తోంది. స్వామి వారు కొలువైన తిరుమల వ్యాప్తంగా కాలుష్య కారకాలను నిషేధించే దిశగా తితిదే చర్యలు చేపట్టింది. వచ్చే సంక్రాంతి నుంచి మంచి నీటి ప్లాస్టిక్ సీసాలను నిషేధించనుంది.
నిత్యం తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులతో పాటు స్థానికులు, వ్యాపారుల వల్ల పెద్ద ఎత్తున తడి, పొడి చెత్త పోగవుతోంది. రోజుకు సగటున 5.40 టన్నుల చెత్త ఉత్పత్తవుతోంది. ఇందులో 20 టన్నులు ప్లాస్టిక్ కాగా.. 10 టన్నుల గ్లాస్ సీసాలు, 28 టన్నుల వరకూ చెప్పులు కూడా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. మెటల్, సిరామిక్, కార్డు బోర్డు, ఆహార వ్యర్థాలు, పూలు, జీవ, భవన వ్యర్థాలు కూడా ఉంటున్నాయి. వీటిలో నష్ట కారక వ్యర్థాలను నియంత్రించడం సహా మిగిలిన వాటి పునర్వినియోగంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్లాస్టిక్ సీసాల్లో నీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా అడుగడుగునా జల ప్రసాద వాటర్ ఫిల్టర్ కేంద్రాలను ప్రారంభిస్తూ భక్తులు ఈ నీటినే తాగేలా తితిదే చైతన్య పరుస్తోంది.
కార్యాచరణ ఇదీ
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద ప్లాస్టిక్కు బదులు జనపనార సంచుల వాడకం.
- ప్లాస్టిక్ నీళ్ల సీసాల స్థానంలో అందుబాటులోకి రాగి, స్టీల్ సీసాలు తీసుకురావడం.
- యాత్రికుల వసతి సముదాయాల్లో జలశుద్ధి కేంద్రాల ఏర్పాటు.
- తితిదే కార్యాలయాల్లో మట్టికుండలు, పునర్వినియోగ డబ్బాల వాడకం.
- తిరుమలలో వ్యర్థాల శుద్ధి ప్రక్రియకు సేంద్రియ పదార్థాల వాడకం.
ఇవీచూడండి: యాదగిరి గుట్టలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు