ఏవీ రమణ దీక్షితులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా కేసులో ఉపసంహరణ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు పిటిషన్ వెనక్కి తీసుకుంటామని తిరుపతి కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణను ఈ నెల 23కు తిరుపతి కోర్టు వాయిదా వేసింది.
పరువు నష్టం కేసు ఏంటి?
గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకులుగా ఉన్న ఏవీ రమణదీక్షితులు ఆలయంలో పింక్ డైమండ్ మాయమైందని ఆరోపిస్తూ.. తితిదే తీరును అప్పట్లో తప్పుబట్టారు. ఇదే అంశంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి తితిదే ఛైర్మన్, నాటి నుంచి ఇటీవలి వరకూ ఈవోగా ఉన్న అనిల్‌కుమార్ సింఘాల్ దీనిపై గట్టిగా స్పందించారు. తితిదే ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ 2018లో ఒక్కొక్కరిపై రూ.100 కోట్ల చొప్పున రూ.200 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఇందుకోసం న్యాయస్థానంలో రూ.2 కోట్ల ధరావతు చెల్లించారు.
అయితే రాష్ట్రంలో సర్కారు మారినందున కొత్త ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. రమణ దీక్షితులును ఆగమ సలహామండలి సలహాదారుగా నియమించారు. ఈ సమయంలోనే గతంలో తితిదే వేసిన పరువునష్టం దావా విషయాన్ని కొత్త ఛైర్మన్ వద్ద ప్రస్తావించగా, తాము దాన్ని ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. దావాను విరమించుకుంటున్నట్లు తిరుపతిలోని జిల్లా కోర్టులో ఇటీవలే తితిదే తరఫున పిటిషన్ వేశారు. చెల్లించిన రూ.2 కోట్లనూ వదులుకుంటామన్నారు. ఈ నిర్ణయంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు, పలు సంఘాలు తితిదే నిర్ణయాన్ని తప్పుబట్టాయి. ఈ క్రమంలో వెనక్కి తగ్గిన తితిదే... ఉపసంహరణ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: కేటీఆర్ పీఏనంటూ డబ్బు డిమాండ్... అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్