Tirumala Sarva Darshan Tickets: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తితిదే ఈనెల 27న విడుదల చేయనుంది. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఉచిత సర్వదర్శనం టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతామని దేవస్థానం అధికారులు తెలిపారు. డిసెంబర్ కోటా టికెట్లను తితిదే వెబ్సైట్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వసతి గదులకు సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు. రెండు నెలలుగా సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే తితిదే విడుదల చేస్తోంది.
గత వారం తిరుమలలో కురుసిన భారీ వర్షానికి కనుమ దారులు, శ్రీవారి మెట్లు, అలిపిరి మార్గాలు చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. రెండు రోజులు పాటు దర్శనాలకు విరామమిచ్చిన అధికారులు.. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కానీ మెట్ల మార్గాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అటు వర్షాల వల్ల టికెట్లు ఉండి స్వామివారిని దర్శించుకోలేకపోయిన వారికి.. తితిదే మరో అవకాశం ఇచ్చింది. దర్శనం చేసుకోవాల్సిన తేదీ నుంచి ఆరు నెలల పాటు ఎప్పుడైనా శ్రీవారి సన్నిధికి చేరే అవకాశం ఇచ్చింది.
ఇదీచూడండి: Tirumala Darshan: శ్రీవారిని దర్శించుకోలేని భక్తులకు మరో అవకాశం: ధర్మారెడ్డి