ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే ఔషధ తయారీని భారీ ఎత్తున చేపడతామని ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఆనందయ్య ఔషధంపై కేంద్ర ఆయుర్వేద పరిశోధనామండలి - సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు తొలిదశలో అభిప్రాయ సేకరణ చేసిన విజయవాడ, తిరుపతి ఆయుర్వేద వైద్యులు... ఇందులో హానికారక పదార్థాలు వినియోగించలేదని నివేదికలు సమర్పించారు.
ఒకే రోజు అనుమతులు..
వారి నివేదికల ఆధారంగా హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు ఆనందయ్య మందును పంపిణీ చేసుకోవచ్చంటూ అనుమతులు ఇచ్చాయి. అయితే ఆనందయ్య ఔషధాన్ని రాష్ట్ర ప్రజలకు పెద్దమొత్తంలో అందుబాటులోకి తీసుకువెళ్తామంటూ ముందుకు వచ్చిన తితిదే మాత్రం ఇప్పుడు పునరాలోచిస్తోంది. ఆనందయ్య ఔషధంలో హానికారక పదార్థాలు లేకపోయినా... దాన్ని ఆయుర్వేద ఔషధంగా గుర్తించలేమని ఆయుష్ తేల్చిచెప్పటంతో... తమ నిర్ణయాన్ని తితిదే వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
పెద్దఎత్తున డిమాండ్..
ఆనందయ్య మందుపై ప్రజల్లో పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో... తిరుపతిలో తమ ఆధ్వర్యంలో ఉన్న ఎస్వీ ఆయుర్వేదిక్ ఆసుపత్రికి చెందిన ఫార్మసీ ద్వారా మందును సిద్ధం చేయాలని తితిదే తొలుత భావించింది. ఈ బాధ్యతలను తీసుకున్న తితిదే పాలకమండలి సభ్యుడు, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి... నాలుగైదు రోజులపాటు ఆయుర్వేద వైద్యులతో సమావేశమయ్యారు. ఆయుర్వేద ఫార్మసీని సిద్ధం చేయించి.. సీసీఆర్ఏఎస్ తొలి దశ పరిశోధనలు పూర్తయ్యాక... టాక్సిక్ స్టడీ, జంతువులపై ప్రయోగం, క్లినికల్ ట్రయల్స్ దశలను నిర్వహించేలా పెరుమాళ్లపల్లి ఎస్వీనగర్‌లో ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు బాధ్యతలు అప్పగించారు.
పాలుపోని స్థితిలో తితిదే..
ఆనందయ్య కుటుంబసభ్యులను తిరుపతికి పిలిపించి... ఔషధ తయారీకి చేసుకోవాల్సిన ఏర్పాట్లపైనా చర్చించారు. అనుకోని విధంగా... సీసీఆర్ఏఎస్ నిర్ణయం వెలువడటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో తితిదే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కరోనాకి మందుగా గుర్తింపు రాకపోయినా... రోగనిరోధక శక్తిని పెంపొందించే ఔషధంగానైనా తితిదే ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెవిరెడ్డి ప్రకటించినా... అసలు ఆనందయ్య మందును ఆయుర్వేదంగా చెప్పలేమని ఆయుష్ తేల్చి చెప్పింది.
తయారీపై సందిగ్ధత..
స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ) ప్రకారం ఆనందయ్య మందును తయారుచేయని కారణంగా... కేవలం గ్రామీణ వైద్యంగానే పిలుచుకోవాలని... దుష్ప్రభావాన్ని కలిగించే పదార్థాలు లేకపోవటంతో ప్రజలు తమ ఇష్టం మేరకు వినియోగించుకోవచ్చని ఆయుష్ చెప్పింది. తితిదే ఆయుర్వేద ఫార్మసీలో దీనిని తయారుచేసేందుకు అనుమతి నిరాకరించినట్లైంది. ఇదే అంశాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. అనుమతులు లభించని కారణంగా తయారీపై సందిగ్ధత నెలకొందన్న వారు... ఈ విషయంపై ఆయుష్ స్పష్టమైన అనుమతులు ఇస్తే తయారీపై దృష్టి సారిస్తామని తెలిపారు.
సీఎం జగన్ దృష్టికి..
శేషాచలంలో అందుబాటులో ఉన్న ఔషధాలు, వన మూలికలు, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి వైద్య బృందం, శ్రీశ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీ ఇవన్నీ అందుబాటులో ఉండటంతో... మరోమారు సీఎం జగన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి... ప్రజలకు ఆమోదయోగ్యమైన మరో నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తితిదే చెబుతోంది. ప్రస్తుతానికైతే ఆనందయ్య మందు తయారీచేసే అంశంపై ఎలాంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేస్తోంది.