ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు ఐకాస నేతలు ప్రణాళికలు చేస్తున్నారు. ఆర్టీసీ ఐకాస, విపక్ష నేతలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 21న ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులతో డిపోల ముందు బైఠాయించాలని నిర్ణయించారు. 22న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను కలిసి.. తమ పొట్ట కొట్టొద్దని విజ్ఞప్తి చేయనున్నారు. 23న ప్రజాప్రతినిధులను కలిసి ఆర్టీసి సమ్మెకు మద్దతు, సంఘీభావం తెలపాలని విన్నవిస్తారు. 24న మహిళా కండక్టర్లతో అన్ని డిపోల ముందు దీక్ష చేపడతారు. 25న హైవేలపై రాస్తారోకోలతో దిగ్బంధనం చేస్తారు. 26న ప్రభుత్వ మనసు కరగాలని ఆర్టీసీ కార్మికుల పిల్లలతో డిపోల ముందు దీక్ష చేపడతారు. 27న జీతాల్లేక దీపావళి పండుగ జరుపుకోవడం లేదని నిరసన తెలియజేస్తారు. 28న హైకోర్టులో కేసు విచారణకు హాజరుకానున్నారు. 29న 30వ తేదీన జరిగే బహిరంగసభ పనులను పర్యవేక్షిస్తారు. 30న ఐదులక్షల మందితో సకల జనుల సమర భేరి నిర్వహించాలని నిర్ణయించారు. వీటితో పాటు మరోసారి గవర్నర్ను కలిసి తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఆర్టీసీ ఐకాస నేతలు భావిస్తున్నారు.
కోర్టు తీర్పును ప్రభుత్వం మన్నించి కార్మికులను చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ ఐకాస సమ్మెకు విపక్ష నేతల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఆర్టీసీ అప్పులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. నిజాం నియంతపాలనను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి: రేపటినుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనలు: అశ్వత్థామరెడ్డి