KCR Birth Celebrations: సీఎం కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు రక్తదానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సహా తెరాస కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. పేదల పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోతారని.. హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎంకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుషు ప్రసాదించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ముషీరాబాద్ క్రాస్‌రోడ్‌లో రక్తదాన శిబిరాన్ని మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కంకణబద్ధులై కృషిచేస్తున్నారని వ్యాఖ్యానించారు.
కుత్బుల్లాపూర్‌లో..
హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లోని గండిమైసమ్మ మైదానంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సుమారు 500 మంది రక్తదానం చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి తలసాని అన్నారు. సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
వర్ధన్నపేటలో..
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. రక్త దానం చేసిన కార్యకర్తలకు పండ్లు, గుడ్లు, పాలు, ప్రశంసాపత్రాలు అందించారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రభుత్వవిప్ బాల్క సుమన్ కోరుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. హాలియా, నంది కొండలో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటి రెడ్డి రక్తదానం చేశారు. భవిష్యత్తులో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదగాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి కోరుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో శ్రేణులు పాల్గొన్నారు. సత్తుపల్లి పట్టణంలోని కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.
సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నివాసంలో తెరాస శ్రేణులు రక్తదానం చేశారు. హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో 250 మందికి పైగా తెరాస కార్యకర్తలు, యువకులు రక్తదానం చేశారు. జగిత్యాల సహా మెట్‌పల్లి, కోరుట్లలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీచూడండి: KTR Comments on Modi : 'మోదీకి మరో అవకాశమిస్తే.. తెలంగాణ-ఆంధ్రాను కలిపేస్తారు'