TS-bPASS Telangana : పురపాలక కార్యాలయాలకు వెళ్లనవసరం లేకుండా స్వీయ ధ్రువీకరణ ద్వారా భవన నిర్మాణ అనుమతులు పొందేలా పురపాలకశాఖ 2020 నుంచి టీఎస్‌బీపాస్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అక్రమ నిర్మాణాలు, నిబంధనలు ఉల్లంఘించి చేపట్టే భవనాలకు అడ్డుకట్ట వేసేలా చట్టాన్ని పక్కాగా రూపొందించింది.. చర్యలు తీసుకునేందుకు జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ(డీటీఎఫ్‌సీ)లను నియమించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50వేల భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినా పరిశీలన నామమాత్రంగానే జరుగుతోంది.
Illegal Ventures in Telangana : ప్రతి నిర్మాణంపై కన్నేసి అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా అత్యధిక జిల్లాల్లో డీటీఎఫ్‌సీలు తనిఖీలకు దూరంగానే ఉంటున్నాయి. ఫలితంగా అనుమతులు ఒకలా నిర్మాణాలు మరోలా సాగుతున్నాయి. టీఎస్‌బీపాస్‌లో భాగంగా జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ బృందాలను, ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. నేరుగా, పోర్టల్, కాల్‌సెంటర్లు, మొబైల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై ఇవి మూడు రోజుల్లో పరిశీలన జరపాలి.. అక్రమమని తేలితే ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేయాలి. ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నదిదే. కానీ, అమలుకే నోచడంలేదు. అక్రమ నిర్మాణం/లేఅవుట్ రిజిస్ట్రేషన్ కాకుండా డీటీఎఫ్‌సీలు సబ్‌రిజిస్ట్రార్లకు తెలియజేయాల్సి ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కచోటా ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
ఎక్కడ చూసినా అదే తంతు..
TS-bPASS Process : నిజామాబాద్‌లో మూడు టాస్క్‌ఫోర్సు బృందాలను ఏర్పాటుచేసినా ఒక్క అక్రమ కట్టడంపైనా చర్యలు తీసుకోలేదు. సుమారు 500కు పైగా నిర్మాణాలకు అనుమతులిచ్చినా పరిశీలించిందీ లేదు. నగర శివార్లలో అనుమతి లేకుండా భవనాలను నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదు. అనుమతి కోసం ఒక ప్లానును అందచేసి, నిర్మాణ సమయంలో మరోలా కడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
Illegal Constructions in Telangana : కరీంనగర్ నగరపాలికలో టీఎస్‌బీపాస్ ద్వారా 140 దాకా అనుమతులు ఇచ్చారు. జిల్లా టాస్క్‌ఫోర్సు ఒక్క భవనాన్నీ తనిఖీ చేయలేదు. అక్రమ నిర్మాణాలపై వందకు పైగా ఫిర్యాదులు వచ్చినా కనీస విచారణ జరపని దుస్థితి. విలీన గ్రామాల్లో నిబంధనల ఉల్లంఘనలూ పట్టించుకోవడంలేదు.
TS-bPASS Application : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో టీఎస్‌బీపాస్ చట్టం అమలవుతోంది. ప్రజాప్రతినిధులు ఆగ్రహించిన చోట కనీస చర్యలు తీసుకుంటుండగా.. అక్రమమని తేలినా ప్రజాప్రతినిధుల జోక్యముంటే టాస్క్‌ఫోర్సు మిన్నకుండిపోతోంది. ఒక పురపాలికలో ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని మున్సిపల్ కమిషనరే టాస్క్‌ఫోర్సు దృష్టికి తీసుకెళ్లినా ప్రజాప్రతినిధి జోక్యంతో ఎలాంటి చర్యలూ లేకపోవడం గమనార్హం.
మిర్యాలగూడలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునే విధానంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. డ్రెయిన్లను, రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా చర్యలు కరవు.
కామారెడ్డిలో మొక్కుబడిగా తనిఖీలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన నిర్మాణాల్లో కొన్నింటికి నోటీసులు ఇచ్చారు. కొన్నింటిని పాక్షికంగా కూల్చినా.. నాయకుల జోక్యంతో నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఆదిలాబాద్‌లో టీఎస్‌బీపాస్ ద్వారా 500కి పైగా అనుమతులు ఇచ్చినా మొక్కుబడి పరిశీలన జరుగుతోంది. అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఫిర్యాదులపైనా స్పందించడం లేదు.
మహబూబ్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలపై 150కిపైగా ఫిర్యాదులు టాస్క్‌ఫోర్సుకు వచ్చినా ఇంతవరకూ పదికి మించి పరిశీలించకపోవడం గమనార్హం. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వాటిని ఆపినా వారం తర్వాత యథావిధిగా పనులు జరుగుతున్నాయి.
నల్గొండలో ప్రజాప్రతినిధులు అక్రమ నిర్మాణాలను కూల్చకుండా అడ్డుకుంటున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్ నగరంతో ముడిపడి ఉన్న రెండు జిల్లాల్లో ఒకటి,రెండు భవనాలను కూల్చివేసినా పూర్తిస్థాయిలో అక్రమ నిర్మాణాలపై దృష్టిపెట్టడం లేదు.
సూర్యాపేటలో నిబంధనలకు విరుద్ధంగా 20 సెల్లార్ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. అనుమతులను ఉల్లంఘించి నిర్మించిన 25 భవనాలపైనా ఫిర్యాదులు వచ్చాయి. చర్యలు మాత్రం చేపట్టలేదు.