ప్రతి కార్యకర్త ఇంటికి కేసీఆర్ పెద్దదిక్కులా ఉంటారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భరోసానిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో.. చనిపోయిన తెరాస కార్యకర్తల కుటుంబాలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న ఓ కార్యకర్త చనిపోతే.. ఆ కుటుంబానికి అండగా 60 మంది సభ్యులున్న కుటుంబమే అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
కుటుంబ పెద్ద కేసీఆర్ మనల్ని కాపాడుకుంటారు..
"60 లక్షల సభ్యత్వం కలిగిన అజేయ శక్తిగా తెరాస ఎదిగింది. 60 లక్షల మంది కుటుంబ సభ్యులు తెరాస కుటుంబమే. ఇంటి పెద్దదిక్కును కోల్పోయినా ఆ కార్యకర్త కుటుంబం అధైర్యపడొద్దు. మీ ఇంట్లో వాళ్లు మీకు దూరం కావచ్చు.. కానీ మనందరి కుటుంబం చాలా పెద్దది. ప్రతీ కుటుంబాన్ని కేసీఆర్ కాపాడుకుంటారు. మరణించిన కార్యకర్త కుటుంబ బాధ్యత తెరాస జనరల్ సెక్రెటరీలు తీసుకుంటారు. 80 మంది బాధిత కుటుంబ సభ్యుల సమస్యలను 10 రోజుల్లోనే పరిష్కరిస్తాం. మీ ఇంట్లో వాళ్లు మీకు దూరం అయినా.. కుటుంబ పెద్దగా కేసీఆర్, తెరాస పార్టీ మీకు అండగా ఉంటుంది. రాష్ట్రానికే పెద్ద దిక్కుగా ఉన్న కేసీఆర్ నాయకత్వంలో మనమంతా ధైర్యంగా ముందుకు వెళ్దాం. అందరూ నిబ్బరంగా.. మనో ధైర్యంతో ఉండాలని కోరుకుంటున్నా. ఏ సమస్య వచ్చినా.. జనరల్ సెక్రెటరీలకు, నియోజకవర్గ ఇంఛార్జులకు చెప్పొచ్చు. లేనిపక్షంలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చు."
- కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు
కుటుంబసభ్యులతో కలిసి భోజనం..
బాధిత కుటుబాలకు తలో రెండు లక్షల రూపాయల చెక్కును కేటీఆర్ అందజేశారు. పలువురు కుటుంబ సభ్యులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించి... కావాల్సిన పనులను మరో వారం పది రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వాళ్లతో కలిసి భోజనం చేశారు.
ఇవీ చూడండి: