పురపోరులో ప్రజలు తెరాసకే పట్టం కట్టారు. తెరాస అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటివరకు మరిపెడ, భీంగల్ స్థానాల్లో అన్ని స్థానాలు గెలుచుకుంది.
వర్ధన్నపేట పురపాలిక తెరాస కైవసం
వర్ధన్నపేట పురపాలికను తెరాస కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో 8 స్థానాల్లో తెరాస విజయం సాధించింది. 2 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. భాజపా, స్వతంత్ర అభ్యర్థి చెరో స్థానంలో విజయం సాధించారు.
సత్తుపల్లి మున్సిపాలిటీ తెరాస కైవసం
సత్తుపల్లి మున్సిపాలిటీని తెరాస కైవసం చేసుకుంది. ఛైర్మన్ పదవి కోసం అవసరమైన స్థానాలను గులాబీ పార్టీ గెలుచుకుంది. 1, 7, 10, 13, 16, 19, 22 వార్డుల్లో తెరాస విజయభేరి మోగించింది.
బొల్లారంలో కారు జోరు
ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీని తెరాస కైవసం చేసుకుంది. 22 స్థానాలకు గానూ 17 తెరాస కైవసం చేసుకుంది. భీంగల్ మున్సిపాలిటీలో తెరాస ఏకపక్ష విజయం సాధించింది. 12 వార్డుల్లోనూ విజయభేరి మోగించింది. అలంపూర్ మున్సిపాలిటీలో తెరాస విజయ కేతనం ఎగురవేసింది. ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీలో 20 వార్డులకు గానూ 13 చోట్ల తెరాస విజయం సాధించింది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పురపాలికను తెరాస కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డుల్లో తెరాస అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధించారు. నారాయణ్‌ఖేడ్, డోర్నకల్, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట, ధర్మపురి, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, పరకాల మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంది.
పురపాలక ఎన్నికల ఫలితాల సరళిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలుసుకుంటున్నారు.