TRS Protest: కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ... ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద విజయవాడ జాతీయ రహదారిపై తెరాస ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు, తెరాస జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
కేంద్రం మెడలు వంచైనా..
రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని... బాయిల్డ్ రైస్, రా రైస్ నెపంతో ధాన్యాన్ని తీసుకోకపోవడం కర్షకులను నట్టేట ముంచడమేనని ఆరోపించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గోయల్ తప్పుడు ప్రకటనలతో రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన నిలబడి కేంద్రం మెడలు వంచైనా ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేసే వరకు ఆందోళనలను వివిధ రూపాలలో ఉద్ధృతం చేస్తామని తెలిపారు. ధర్నా వల్ల హైవేపై కాసేపు ట్రాఫిక్ భారీగా స్తంభించింది. దీంతో పోలీసులు, తెరాస నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
ఇదీ చదవండి:'ప్రజలకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఆగదు..'