TRS Protest in Telangana : రాష్ట్రంలో యాసంగి ధాన్యం మొత్తం పంజాబ్ తరహాలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెరాస ర్యాలీలు, నల్లజెండాల ఎగురవేయడం, బైక్ ర్యాలీలతో నిరసన వ్యక్తం చేశారు. అన్నదాతలపై కేంద్రప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని గులాబీ నేతలు హెచ్చరించారు.
ఆఖరి వరకు పోరాడతాం : యాసంగిలో పండించిన ఆఖరి గింజ కేంద్రం కొనేవరకూ కేంద్రంపై పోరాడతామని తెరాస నేతలు స్పష్టం చేశారు. కేంద్రం వైఖరి మారాలనే నినాదంతో దశలవారీ ఉద్యమంలో భాగంగా నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు భారీ ద్విచక్రవాహన ప్రదర్శన చేపట్టాయి. నల్లజెండాతో బైక్ నడుపుతూ ర్యాలీలో పువ్వాడ పాల్గొన్నారు. కేంద్రం దిగొచ్చేంతవరకూ వెనక్కి తగ్గేదిలేదని తేల్చిచెప్పారు.
భయపడేదే లేదు : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో ఇంటింట నల్లజెండాల కార్యక్రమంలో ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. మహబూబ్ నగర్ మండలంలోని జమిస్తాపూర్, తెలుగు గూడెంలలో ఆయన పర్యటించారు. ధరలు పెంచి భాజపా సర్కారు ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. కేంద్ర కక్షసాధింపు చర్యలకు ఏ మాత్రం భయపడబోమన్న ఆయన ధాన్యం కొనేవరకూ పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు.
ఇళ్లపై నల్ల జెండాలు : నిర్మల్‌లో తన నివాసంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నల్ల జెండాలు ఎగురవేసి కేంద్ర వైఖరిపై నిరసన తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం రైతుల శ్రేయస్సు దృష్ట్యా పండించిన వడ్లనన్నింటినీ కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పూసాయి గ్రామంలో తెరాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగురామన్న ఎడ్లబండిపై నల్లజెండాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి కేంద్రం తీరును తప్పుపట్టారు. నిజామాబాద్‌లో తెరాస కార్యకర్తలు, రైతులతో కలిసి ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త బైక్ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ మహాలక్ష్మి నగర్‌లో తన ఇంటిపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నల్లజెండా ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాలలో రైతులు తెరాస నేతలు నల్లజెండా ప్రదర్శన చేపట్టారు.
తెరాస ర్యాలీ : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కరరావు ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. చిట్యాలలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. మహబూబాబాద్ క్యాంపు కార్యాలయంపై ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. జగిత్యాలలో నల్ల జెండాలతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఆందోళనలో పాల్గొన్నారు. సిద్దిపేటలో తెరాస శ్రేణులు ద్విచక్రవాహన ప్రదర్శనతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.