సహకార ఎన్నికల్లో కారు జోరు మరోసారి కొనసాగింది. మెజార్టీ సొసైటీలు కైవసం చేసుకునే దిశగా తెరాస బలపరిచిన అభ్యర్థులే... అత్యధిక వార్డుల్లో విజయం సాధించారు. ఎన్నికలు పార్టీ రహితంగానే జరిగినప్పటికీ.. ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ మద్దతుదారులను గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాయి. తెరాస బలపరిచిన అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో పాగా వేశారు. కాంగ్రెస్ మద్దతుదారులు కొన్నిచోట్ల పోటీ నిచ్చారు.
80 శాతం పోలింగ్
రాష్ట్రంలోని 906 పీఏసీఎస్‌లకు గాను 904 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించారు. అందులో 157 సింగిల్ విండోల్లోని 2017 వార్డులన్నీ ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 747 పీఏసీఎస్‌ల్లోని 3,388 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 6,248 వార్డుల డైరెక్టర్ పదవుల కోసం ఇవాళ ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాల్లో మొత్తం 14,530 మంది పోటీలో ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్‌లో 9,11,599 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అన్ని చోట్లా ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో పాటు ఫలితాలను కూడా ప్రకటించారు. పీఏసీఎస్‌ల పాలకమండళ్లకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు సహకార శాఖ ప్రకటించింది. 80 శాతం పోలింగ్ నమోదైంది.
ఎల్లుండి పీఏసీఎస్ ఛైర్మన్ ఎన్నికలు
ఒక్కో వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 12 నుంచి 13 చొప్పున వార్డులు ఉంటాయి. ఒక్కో సంఘంలో కనీసం 7 వార్డులు గెలిస్తే ఛైర్మన్ పదవి లభిస్తుంది. రేపు, ఎల్లుండి పీఏసీఎస్ ఛైర్మన్లను వార్డు సభ్యులు ఎన్నుకుంటారు. అనంతరం పీఏసీఎస్ ఛైర్మన్లు డీసీసీబీ, డీసీఎమ్ఎస్ ఛైర్మన్లను ఎన్నుకోనున్నారు. మార్క్‌ఫెడ్ పాలకవర్గాలను పీఏసీఎస్ ఛైర్మన్లే ఎన్నుకుంటారు. 17 లేదా 18న డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: 'సహకార' ఎన్నికలు ప్రశాంతం.. ఫలితాల విడుదల